Sankranti: కోడి పందేలు చూసొద్దాం!
ABN , Publish Date - Jan 14 , 2025 | 03:30 AM
సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు.

సంక్రాంతికి భారీగా ఏపీకి తెలంగాణ వాసులు.. హైదరాబాద్ నుంచి 60 వేల కార్లు వెళ్లినట్లు అంచనా
నగరం నుంచి 10 లక్షల మంది పైగా ప్రయాణం.. వీరిలో గణనీయ సంఖ్యలో తెలంగాణ ప్రజలు
హైదరాబాద్/మియాపూర్, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండగకు ఈ సారి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. గతంతో పోలిస్తే ఈ ఏడాది కొత్త ట్రెండ్ మొదలైనట్లు అంచనా వేస్తున్నారు. ఏపీలో జరిగే సంక్రాంతి పండగతో పాటు కోడిపందేలు, ఇతర సంబరాలను తిలకించడానికి తెలంగాణ నుంచి.. ముఖ్యంగా హైదరాబాద్ నుంచి భారీగా జనం తరలి వెళ్లారు. ఒక్క హైదరాబాద్ నుంచే 10 లక్షల మందికి పైగా ఉంటారని అంచనా. వీరిలో తెలంగాణ వాసులు కూడా భారీగానే ఉన్నారు. సాధారణంగా అయితే ప్రతి సంక్రాంతికి హైదరాబాద్, చుట్టుపక్కల నివసించే ఏపీ వాసులు వారి సొంత ఊర్లకు వెళుతుంటారు. కొందరు తెలంగాణ వాసులు కూడా అక్కడికి వెళ్లే ఆనవాయితీ ఉంది. అయితే.. ఈసారి తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో వెళ్లారు.
వరసగా సెలవులు రావడం, ఏపీలో సంక్రాంతి వేడుకలు భిన్నంగా ఉండడంతో ప్రజల్లో ఆసక్తి పెరిగింది. విజయవాడ, భీమవరం, రాజమండ్రి, విశాఖపట్నం వంటి నగరాలు, సమీప ప్రాంతాల్లో జరిగే భోగి పండగతో పాటు కోడి పందేలను చూడడానికి తెలంగాణ వాసులు తరలి వెళ్లారు. ఇలా వెళ్లిన వారిలో కొందరు తమకు తెలిసిన వారి ఇళ్లలో ఉండగా, చాలా మంది హోటళ్లలో దిగారు. హైదరాబాద్ నుంచి మూడు రోజుల్లోనే సుమారు 60 వేల కార్లు ఏపీకి వెళ్లినట్లు అంచనా. అందుకే టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ స్తంభించిపోయింది. హైదరాబాద్ నుంచి భారీగా జనం సొంతూళ్లకు వెళ్లడంతో నగరంలోని చాలా ప్రాంతాలు బోసిపోయాయి. పండగకు మూడు రోజుల ముందు నుంచే భారీగా ప్రజలు సొంతూళ్లకు వెళ్లడంతో ఐటీ జోన్ నిర్మానుష్యంగా మారింది. మాదాపూర్, గచ్చిబౌలి, గౌలిదొడ్డి, రాయదుర్గం, కొండాపూర్, మియాపూర్, చందానగర్‌లో ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. సాప్ట్‌వేర్ ఉద్యోగులు భారీగా ఊళ్లకు వెళ్లడంతో కంపెనీల గేట్లు సైతం మూతపడ్డాయి. ట్రాఫిక్ లేకపోవడంతో కాలుష్యం కూడా తగ్గిందని అధికారులు చెబుతున్నారు.