Share News

Hyderabad: మరో సరగసీ దందా!

ABN , Publish Date - Aug 16 , 2025 | 03:30 AM

హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతం.. చూడడానికి అది నివాస భవనంలా కనిపిస్తుంది. కానీ అక్కడ అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సరగసీ (అద్దె గర్భం) దందా సాగుతోంది.

Hyderabad: మరో సరగసీ దందా!

  • కుత్బుల్లాపూర్‌లో అనుమతి లేకుండా

  • రహస్యంగా నిర్వహిస్తున్న తల్లీకొడుకులు

  • పెంట్‌ హౌస్‌లోనే ఫర్టిలిటీ కేంద్రం

  • పలు ఫర్టిలిటీ సెంటర్లతో సంబంధాలు

  • పిల్లలు లేని దంపతుల వివరాల సేకరణ

  • సరగసీ విధానం ద్వారా పిల్లలు కలిగేలా

  • చేస్తామంటూ 20 లక్షలకు పైగా వసూలు

  • ‘అద్దె గర్భం’ కోసం పేద మహిళలకు ఎర

  • వారి నుంచి ఖాళీ బాండ్లపై సంతకాలు

  • నిందితులైన తల్లీకొడుకుల అరెస్టు

పేట్‌ బషీరాబాద్‌, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌లోని కుత్బుల్లాపూర్‌ ప్రాంతం.. చూడడానికి అది నివాస భవనంలా కనిపిస్తుంది. కానీ అక్కడ అనుమతులు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా సరగసీ (అద్దె గర్భం) దందా సాగుతోంది. కనీసం నేమ్‌ బోర్డు అయినా లేని.. ఆ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో సరగసీ దందా నిర్వాహకులైన తల్లీకొడుకులు ఉంటున్నారు. మొదటి అంతస్తును బ్యాచిలర్లకు అద్దెకు ఇచ్చారు. దానిపైన పెంట్‌ హౌస్‌లో ‘సరగసీ సెంటర్‌’ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లోని పలు ఫర్టిలిటీ కేంద్రాలతో సంబంధాలు పెట్టుకుని నిరుపేద మహిళలతో అద్దె గర్భం దందా సాగిస్తున్నారు. సంతానం లేని దంపతుల నుంచి రూ.20 లక్షల చొప్పున వసూలు చేస్తున్నారు. పేట్‌ బషీరాబాద్‌, మేడ్చల్‌ ఎస్‌వోటీ పోలీసులు శుక్రవారం దాడి చేయడంతో సరగసీ దందా బయటపడింది. సరగసీ పేరుతో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌ దారుణ మోసాలు వెలుగు చూసిన కొద్దిరోజులకే ఈ దందా బయటపడడం గమనార్హం. మేడ్చల్‌ డీసీపీ కోటిరెడ్డి, ఎస్‌వోటీ అడిషనల్‌ డీసీపీ విశ్వప్రసాద్‌, ఏసీపీ బాలగంగిరెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. ఏపీలోని చిలుకలూరిపేటకు చెందిన నర్రెద్దుల లక్ష్మీ రెడ్డి (50) ఉపాధి కోసం ముంబైకి వెళ్లి అక్రమంగా మానవ రవాణా చేస్తూ పట్టుబడి జైలుకెళ్లింది.


విడుదలైన తర్వాత తన కుమారుడు నరేందర్‌ రెడ్డి (25)తో కుత్బుల్లాపూర్‌ సర్కిల్‌ పద్మానగర్‌ రింగు రోడ్డు సమీపంలోని మాణిక్య నగర్‌లో ఉంటూ సరగసీ దందా మొదలుపెట్టింది. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో వారు ఉంటూ పెంట్‌ హౌస్‌లో సరగసీ అండ్‌ ఎగ్‌ ట్రేడింగ్‌ కేంద్రం నడుపుతోంది. మాదాపూర్‌లోని శ్రీలీల, హెగ్డే ఫర్టిలిటీ-ఐవీఎఫ్‌ కేంద్రాలకు వెళ్లి సంతానం కలగదని ఆశలు వదులుకున్న దంపతుల సమాచారం, వారి ఫోన్‌ నంబర్లను అక్కడ సిబ్బంది ద్వారా సేకరిస్తుంది. అద్దె గర్భం ద్వారా పిల్లలు కలిగేలా చేస్తానని నమ్మించి పిలిపించుకుంటుంది. అలాంటి వారి నుంచి రూ.20 లక్షలకు పైగా వసూలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. గర్భం అద్దెకిచ్చే పేద మహిళలకు మాత్రం స్వల్ప మొత్తంలో ఇచ్చి చేతులు దులుపుకుంటోంది. వారిని బెదిరించడానికి వీలుగా లక్ష్మి, నరేందర్‌ రెడ్డిలు ఖాళీ బాండ్‌ పేపర్ల సంతకాలు తీసుకుంటున్నారు.


పోలీసుల దాడిలో వీరిద్దరితో పాటు గర్భాన్ని అద్దెకిచ్చే ఏపీలోని రంపచోడవరం, అల్లూరి సీతారామరాజు, విజయనగరం జిల్లాలకు చెందిన ఆరుగురు మహిళలను, కర్ణాటకకు చెందిన మరో మహిళను అదుపులోకి తీసుకున్నారు. రూ.6.47 లక్షలు, ల్యాప్‌ట్యాప్‌, ప్రామిసరీ నోటు, నాన్‌ జుడీషియల్‌ బాండ్‌ పేపర్లు, హార్మోన్‌ ఇంజెక్షన్లు, మందులు, హెగ్డే ఆస్పత్రి, శ్రీలీల ఆస్పత్రుల కే షీట్లు, 6 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఆరు ఫర్టిలిటీ కేంద్రాల పాత్ర ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మాదాపూర్‌ హెగ్డే ఫర్టిలిటీ సెంటర్‌, సోమాజిగూడ అను టెస్ట్‌ ట్యూబ్‌ సెంటర్‌, బంజారాహిల్స్‌ ఫర్టీ కేర్‌, ఈవీఏ ఐవీఎఫ్‌, అమూల్య ఐవీఎఫ్‌, కొండాపూర్‌ శ్రీ ఫర్టిలిటీ సెంటర్లతో నిందితులు లక్ష్మి, నరేందర్‌ రెడ్డికి సంబంధాలు ఉన్నట్లు విచారణలో తేలింది. ఈ కేంద్రాల పాత్రపై లోతైన దర్యాప్తు చేయనున్నట్లు డీసీపీ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

రాజ్‌భవన్‌‌లో ఎట్ హోమ్.. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం దంపతులు

ఫామ్‌హౌస్‌కు చేరుకున్న కవిత

ఆవకాయ పెట్టాలన్నా.. అంతరిక్షంలోకి వెళ్లాలన్నా..

Read Latest Telangana News and National News

Updated Date - Aug 16 , 2025 | 03:30 AM