Share News

Hyderabad Future Focus: హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం హైడ్రా

ABN , Publish Date - Aug 24 , 2025 | 02:55 AM

హైడ్రా ఏం చేస్తుందన్నది ఏడాదిలో అందరికీ అర్థమవుతుంది. కాలగమనంలో హైడ్రా విశిష్టత తెలుస్తుంది. వంద, రెండు వందల ఏళ్ల హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం.. భవిష్యత్‌ తరాల ఆరోగ్య జీవనం కోసం సంస్థ పని చేస్తోంది’’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు..

Hyderabad Future Focus: హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం హైడ్రా

సంస్థ ఏం చేస్తుందో కాలమే చెబుతుంది.. భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకర పరిస్థితులు

  • నాడు దూషించిన వారినుంచి నేడు జేజేలు

  • దావూద్‌ ఇబ్రహీం తరహాలో బెదిరింపులు

  • ఫాతిమా కాలేజీపైనా చర్యలు!!

  • ‘మీట్‌ ది ప్రెస్‌’లో హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌

హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): ‘‘హైడ్రా ఏం చేస్తుందన్నది ఏడాదిలో అందరికీ అర్థమవుతుంది. కాలగమనంలో హైడ్రా విశిష్టత తెలుస్తుంది. వంద, రెండు వందల ఏళ్ల హైదరాబాద్‌ భవిష్యత్తు కోసం.. భవిష్యత్‌ తరాల ఆరోగ్య జీవనం కోసం సంస్థ పని చేస్తోంది’’ అని హైడ్రా కమిషనర్‌ ఏవీ రంగనాథ్‌ అన్నారు. గతంలో చెరువుల్లో ఆక్రమణలు తొలగించినప్పుడు శాపనార్థాలు పెట్టిన వారే.. దూషించిన వారే.. ఇప్పుడు చెరువుల వద్ద జరుగుతున్న అభివృద్ధిని చూసి జేజేలు కొడుతున్నారని, కూకట్‌పల్లిలోని నల్లచెరువు ఇందుకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. ‘‘పర్యావరణ పరిరక్షణ, ప్రభుత్వ ఆస్తుల రక్షణ, విపత్తుల నిర్వహణ కోసం హైడ్రా ఏర్పాటైంది. దీనిని జాగ్రత్తగా ముందుకు తీసుకెళ్లాలి. సమాజానికి ఉపయోగపడేలా తీర్చిదిద్దాలి. సంస్థ ప్రారంభమైన తొలినాళ్లలో కొన్ని పొరపాట్లు జరిగాయి. వాటినిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నాం’’ అని స్పష్టం చేశారు. ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ శ్రీనివా్‌సరెడ్డి, టీయూడబ్ల్యూజే అధ్యక్షుడు విరాహత్‌అలీ ఆధ్వర్యంలో శనివారం బషీర్‌బాగ్‌ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన ‘మీట్‌ ది ప్రెస్‌’లో రంగనాథ్‌ పలు అంశాలపై మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా హైడ్రా పనిచేస్తుందని, ఈ సంస్థ ఎప్పటికీ ఉంటుందని స్పష్టంచేశారు. హైడ్రా వల్ల ప్రభుత్వానికి మంచి పేరు వస్తోందా? లేదా? అన్నది కాలమే నిర్ణయిస్తుందని రంగనాథ్‌ పేర్కొన్నారు. హైడ్రాకు 25వేల ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలుతీసుకుంటామని చెప్పారు. మీట్‌ ద ప్రెస్‌ వివరాలు ఆయన మాటల్లోనే..


16 నుంచి 28 ఎకరాలకు..

మొదటివిడతగా ఆరు చెరువుల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం. ఇందులో కూకట్‌పల్లి నల్లచెరువు ఒకటి. గతంలో ఈ చెరువు వద్ద 16 నివాసేతర ఆక్రమణలను తొలగించినప్పుడు విమర్శలు వచ్చాయి. ఇటీవల ఆ చెరువు వద్దకు వెళ్తే.. స్థానికులు వచ్చి, సంతోషం వ్యక్తంచేశారు. ఆక్రమణల తొలగింపుతో కొందరికి ఇబ్బంది కలగొచ్చు.. కానీ చాలా మందికి ఉపయుక్తంగా ఉంది. 16 ఎకరాలు ఉన్న ఆ చెరువు విస్తీర్ణం ఇప్పుడు 28 ఎకరాలకు పెరిగింది. ఆదివారం చెరువు పరిసరాల్లో పిక్నిక్‌ వాతావరణం ఉంటోంది. ఇప్పటి వరకు రూ.30 వేల కోట్ల విలువైన 500ఎకరాలకుపైనా ప్రభుత్వ భూములు, పార్కులు, చెరువుల ఆక్రమణ స్థలాలను స్వాధీనం చేసుకున్నాం. భవిష్యత్‌లో కబ్జా అయ్యే అవకాశాలున్న స్థలాల చుట్టూ కంచె వేస్తున్నాం. ఈ క్రమంలో బెదిరింపులు వస్తున్నాయి. బతుకమ్మ కుంట విషయంలో దావూద్‌ ఇబ్రహీం తరహాలో కొందరు భయపెట్టే ప్రయత్నాలు చేశారు. ఇప్పటి వరకు 80ుచెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్‌ మాత్రమే విడుదలైంది. ఎఫ్‌టీఎల్‌ను ఇంకా నిర్ధారించలేదు. శాస్ర్తీయంగా, సాంకేతికంగా, చట్టపరంగా.. సర్వే ఆఫ్‌ ఇండియా టోపోషీట్స్‌, నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ మ్యాపులు, రెవెన్యూ, నీటిపారుదల రికార్డుల ఆధారంగా ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తాం. ఎన్‌జీఆర్‌ఐ సహకారంతో ఏయే ప్రాంతాల్లో ఎక్కువ నీరు భూమిలోకి ఇంకే అవకాశముందో గుర్తించి.. తొలుత అక్కడి చెరువులను పునరుద్ధరిస్తాం. తద్వారా భూగర్భ జలాలు పెరిగే అవకాశముంటుంది. చాలా చెరువుల్లో ప్రతీ 100 లీటర్ల వర్షపు/వరద నీటిలో 2-3లీటర్లే భూమిలోకి ఇంకుతున్నాయి. చెరువుల తరహాలో నాలాలనూ నోటిఫై చేస్తాం. గతంలో నాలాల వెడల్పు, లోతు ఎంత ఉండేది? ఇప్పుడు ఎంత ఉందన్న లెక్కలు తీస్తున్నాం. నివాసాల జోలికి వెళ్లకుండా.. ఇతర ఆక్రమణలను తొలగిస్తాం. 55 కిలోమీటర్ల మేర ఉన్న బుల్కాపూర్‌ నాలా.. కొన్ని చోట్ల మూసుకుపోయింది. దాన్ని పునరుద్ధరిస్తున్నాం. సున్నం చెరువు, ఇతర జల వనరుల్లో నీటి నమూనాలను పరీక్షించాం. క్యాన్సర్‌ కారకాలు, సంతానోత్పత్తిపై ప్రభావం చూపే, ప్రజారోగ్యాన్ని దెబ్బతీసే అవశేషాలు ఉన్నట్లు గుర్తించాం. హుస్సేన్‌సాగర్‌లో నీటి నాణ్యత మెరుగుపడాలని ఆకాంక్షిస్తున్నాం. హైదరాబాద్‌ను ప్లాస్టిక్‌-ఫ్రీ మార్చాలని నిర్ణయించాం.


ఏ కాలేజీ అయినా చట్టప్రకారమే...

ఫాతిమా కాలేజీ భవనాలకు మినహాయింపు లేదు. అక్కడి సల్కం చెరువు ఎఫ్‌టీఎల్‌ నిర్ధారణ పూర్తయ్యాక చట్ట ప్రకారం ముందుకెళ్తాం. విద్యాసంవత్సరం మధ్యలో కూల్చివేతలు చేపడితే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని భావించాం. ఫాతిమా కాలేజీ అయినా మల్లారెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి విద్యాసంస్థలైనా చట్ట ప్రకారం వ్యవహరిస్తాం. గండిపేటలో ప్రజాప్రతినిధుల అతిఽథి గృహాలు, ఇతర ఆక్రమణలను కూల్చివేశాం. హిమాయత్‌సాగర్‌కు సంబంధించి ప్రాథమిక ఎఫ్‌టీఎల్‌ ప్రకటన వెలువడాల్సి ఉన్నందున.. చర్యలు తీసుకోలేకపోయాం. వాతావరణ సమాచారంలో కొంత అస్పష్టత ఉందని, క్షేత్రస్థాయిలో తగిన సదుపాయాలతో ఈ సమస్యను అధిగమించవచ్చు. ఇటీవల భారీ వర్షాలు పడతాయని అప్రమత్తమైనా.. ఆ స్థాయిలో వానపడలేదు.


ఇవి కూడా చదవండి..

నిధుల్లో న్యాయబద్ధమైన వాటా మాకివ్వడం లేదు.. కేంద్రంపై స్టాలిన్ విసుర్లు

అది సుప్రీం తీర్పు, నా వ్యక్తిగతం కాదు: హోం మంత్రికి సుదర్శన్ రెడ్డి కౌంటర్

For More National News And Telugu News

Updated Date - Aug 24 , 2025 | 02:55 AM