Bonalu 2025: రాజకీయాలకతీతంగా బోనాలు చేసుకుందాం.. పొన్నం పిలుపు
ABN , Publish Date - Jun 24 , 2025 | 11:09 AM
Bonalu 2025: దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ మంత్రి పొన్నం ప్రభాకర్ అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికీ తీసి పోరన్నారు.
హైదరాబాద్, జూన్ 24: నగరంలో ఎంతో వైభవంగా జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర (Bonalu Festival) ఉత్సవాలపై ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఈరోజు (మంగళవారం) సమీక్షా సమావేశం నిర్వహించారు. అమ్మవారి బోనాల ఉత్సవాల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చారిత్రాత్మకమైన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు రాజకీయాలకు అతీతంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వం పక్షాన ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా స్థానికుల సహకారం లేకపోతే విజయవంతం కాదన్నారు. గత సంవత్సరం ఏమైనా పొరపాటు జరిగితే సమీక్షించుకుని మరిన్ని ఏర్పాట్లు చేయడానికి ఈ సమీక్ష ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
దేవాలయ ఏర్పాట్ల కోసం భాగస్వామ్యం అవుతున్న అందరికీ అభినందనలు తెలియజేశారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఆలయం లోపల కేబుల్ వైర్‌లు కొత్తవి వేసి ఇబ్బందులు, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలన్నారు. భారీ కెడింగ్ జాలి ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఆతిథ్యం ఇవ్వడంలో హైదరాబాద్ నగర ప్రజలు ఎవరికీ తీసి పోరన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు స్థానిక హైదరాబాద్ ప్రజలు వారి ఆతిథ్యం ఇవ్వాలన్నారు. ఒక్కో వారం ఒక్కో ఏరియాలో పండుగ జరుగుతుంది కాబట్టి ఆయా ప్రాంతాల్లో వాటర్ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని.. అవసరమైతే రెండు సార్లు నీటిని ఇవ్వాలని ఆదేశించారు. హైదరాబాద్ మొత్తం ఒకేసారి పండుగ జరిగితే కొంత ఇబ్బంది ఉంటుందని.. కానీ ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉంటుందని, భద్రత విషయంలో పోలీసులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.
అమ్మవారి ఆశీర్వాదం ఉండాలని.. ప్రభుత్వ పరంగా అన్ని శాఖల అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు. 3600 దేవాలయాలకు సంబంధించి సమీక్ష రాష్ట్ర స్థాయి అధికారులతో జరిగిందని తెలిపారు. గోల్కొండ, ఉజ్జయిని మహంకాళి, బల్కంపేట, లాల్ దర్వాజా ఇలా ఒక్కో వారం ఒక్కో ఆలయంలో ఉత్సవాలు జరుగుతాయని.. జోగిని వాళ్ళకు ప్రత్యేక ఏర్పాట్లు చేశామని చెప్పారు. తమకు బోనం ఎత్తుకునే వారే ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. బోనాల సమయంలో కాకుండా రద్దీ తక్కువ ఉన్న సమయంలో వీఐపీ వస్తే ఇబ్బందులు ఉండవన్నారు. ఉజ్జయిని మహంకాళి బోనాలు చరిత్రలో నిలిచిపోయే విధంగా ఉండాలని తెలిపారు. డెక్కన్ మానవ సేవ సమితి , ఇతర సంస్థలు ఇక్కడ చాలా సేవ కార్యక్రమాలు చేస్తున్నాయన్నారు. అందరూ వారి సహకారం అందించి ఉత్సవాల్లో భాగస్వామ్యం కావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే తలసాని, జిల్లా కలెక్టర్ హరిచందన, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
హైదరాబాద్‌లో దారుణం.. కన్న కూతురుపై
రియల్ మోసం.. వైసీపీ నేత కుమారుడి అరెస్ట్
ఏపీలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు అమోదం..
Read Latest Telangana News And Telugu News