Hyderabad: సెల్లార్ తవ్వకాల్లో అపశృతి.. మట్టి దిబ్బలు కూలి ముగ్గురు మృతి
ABN , Publish Date - Feb 05 , 2025 | 12:58 PM
Hyderabad: సెల్లార్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ఈ ఘటనలో హైదరాబాద్‌లోని ఎల్బీనగర్‌లో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బీహార్ చెందిన కార్మికులు మృతి చెందారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 5: నగరంలోని ఎల్బీనగర్‌లో (LB Nagar) విషాదం చోటు చేసుకుంది. సెల్లార్ తవ్వకాల్లో అపశృతి చోటు చేసుకుంది. సెల్లార్ లోపల పనిచేస్తుండగా పైనుంచి మట్టిదిబ్బలు కుప్పకూలాయి. ప్రమాద సమయంలో నలుగురు కార్మికులు సెల్లార్లో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మట్టిదిబ్బలు పడటంతో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మట్టిదిబ్బల కింద నుంచి మూడు మృతదేహాన్ని బయటకు తీశారు.
అయితే రెండు గంటల పాటు శ్రమించిన తర్వాత అతికష్టం మీద మూడు మృతదేహాలను వెలికితీశారు. మృతి చెందిన ముగ్గురు బీహార్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. మృతులు వీరయ్య, వాసు, రాములుగా తెలుస్తోంది. ముగ్గురి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా.. తీవ్రంగా గాయపడిన వ్యక్తిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఒక్కసారిగా సెల్లార్‌లో మట్టిదిబ్బలు కూలి పెద్ద శబ్ధం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. మృతుల్లో ఇద్దరు తండ్రీ, కొడుకులు ఉన్నట్లు గుర్తించారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో పనిచేసే ప్రాంతంలో విషాదఛాయలు అలముకున్నాయి.
Breaking News: ఉత్తరాంధ్ర వాసులకు కేంద్రం శుభవార్త..
అయితే సెల్లార్ తవ్వకాలు జరుపుతున్న సమయంలో జీహెచ్‌ఎంసీ నిబంధనల ప్రకారం ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సెల్లార్ తవ్వే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. గత కొంతకాలంగా ఈ అపార్ట్‌మెంట్ నిర్మాణం జరుగుతున్న క్రమంలో పెద్ద ఎత్తున సెల్లార్ కోసం తవ్వకాలు చేపట్టారు. రాత్రి సమయంలో పెద్ద ఎత్తున పేలుళ్లు జరుపుతున్నట్లు స్థానికులు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ విషయాన్ని జీహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారు పట్టించుకోని పరిస్థితి. ఈ సెల్లార్లన్నీ కూడా 40 అడుగుల లోతులో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంత పెద్దఎత్తున సెల్లార్ల తవ్వకం చేస్తున్నప్పటికీ కూడా జీహెచ్‌ఎంసీ అధికారులు చూసీ చూడనట్లుగా వ్యవహరించారని.. జీహెచ్‌ఎంసీ అధికారులు పర్మిషన్లు ఇవ్వడం వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని స్థానికులు మండిపడుతున్నారు.
ఇవి కూడా చదవండి...
BRS: బీఆర్ఎస్ సంచలన నిర్ణయం.. ఆ ఎన్నికలకు బీఆర్ఎస్ దూరం
Read Latest Telangana News And Telugu News