Ponnam Prabhakar: తల్లిదండ్రులు వారి పిల్లలను శక్తి మేర చదివించాలి: పొన్నం
ABN , Publish Date - May 25 , 2025 | 03:12 PM
తెలంగాణ బీసీ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ .. సోమవారం హైదరాబాద్‌లో జ్యోతిరావు పులే చిత్రాన్ని వీక్షించారు. ఆయనతోపాటు బీసీ ఎమ్మెల్యే, ఎంపీలు, బీసీ సంఘాల నేతలు ఈ చిత్రాన్ని వీక్షించారు.
హైదరాబాద్, మే 25: విద్యను రాబోయే తరానికి అందించే క్రమంలో పిల్లలను వారి శక్తి మేరకు చదివించాలని తల్లిదండ్రులకు తెలంగాణ రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపు నిచ్చారు. అప్పుడు సమాజంలో అందరూ విద్యకు దగ్గరవుతారన్నారు. మహిళలను స్వేచ్ఛగా ముందుకు తీసుకు వెళ్లాలని ఆయన ఆకాంక్షించారు. ఆదివారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్ ల్యాబ్‌లో సామాజికవేత్త మహాత్మా జ్యోతిరావు పూలే సినిమాను బీసీ ప్రజా ప్రతినిధులతోపాటు బీసీ సంఘాలతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ వీక్షించారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. భారతదేశంలో మొట్టమొదటిసారిగా వెనుకబడిన బలహీన వర్గాలకు సంబంధించి కాకాసాహెబు కాలేల్కర్ ఒక ప్రతిపాదనను సిద్ధం చేశారన్నారు. ఆయన ప్రతిపాదన మేరకు బీసీ మండల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు. దేశంలో బీసీల వికాసం కోసం వీరు పని చేశారని చెప్పారు. వీరికి స్పూర్తి జ్యోతిరావు పూలే అని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.
వీరందరి కృషిని కొనసాగిస్తూ తెలంగాణ ప్రభుత్వ సారథ్యంలో దేశంలోనే తొలి సారిగా కుల గణన చేపట్టడం జరిగిందని ఆయన వివరించారు. అందుకు మహాత్మా జ్యోతిరావు పూలే స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్లు వచ్చినప్పుడు ఎస్సీ,ఎస్టీలకు సైతం ఇవ్వాలన్నప్పుడు ఆ బిల్లు పెండింగ్‌లో పడిందని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డిని సినిమా ప్రముఖులతో కలిసి ట్యాక్స్ మినహాయింపు జరిగేలా చేస్తామన్నారు.
తెలంగాణ ప్రభుత్వం దేశానికి రోల్ మోడల్‌గా కుల గణన చేసుకున్నామని.. తద్వారా బీసీలకు చట్టంలో రిజర్వేషన్లు పెంచుకున్నామన్నారు. లోక్ సభలో ప్రతిపక్ష నేత, ఎంపీ రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సందర్భంగా సామాజిక సమీకరణలు మారాలని చెప్పారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. సినిమాలో చూపించిన సారాంశాన్ని సమాజంలో ప్రతి బలహీన వర్గాల బిడ్డ విద్యకు దూరంగా ఉండకుండా చూడాలని పిలుపు నిచ్చారు. మహిళా అభ్యున్నతికి వాళ్లు సాధికారత సాధించాలని చెప్పారు.
ప్రొ. కంచె ఐలయ్య సూచన మేరకు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, కార్పొరేషన్ల చైర్మన్లతోపాటు బీసీ సంఘాల నేతలకు ఈ సినిమా చూపించామన్నారు.
ఇక తెలంగాణ ప్రభుత్వ సలహాదారు కే. కేశవరావు మాట్లాడుతూ.. మహాత్మా జ్యోతిరావు పూలే సినిమా అద్భుతంగా ఉందన్నారు. ఈ సినిమా చూపించినందుకు మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు. 1888 నుండి ఇప్పటి వరకు సమాజంలో మార్పులు.. వీటితోపాటు బ్రహ్మణిజం ఉందా? అనేది మీరు ఆలోచించుకొవాలన్నారు.
సామాజిక సంస్కరణ, విద్య ముఖ్యమన్నారు. ఇక ఈ సినిమాలో పూలే గురించి 10 శాతమే ఉందన్నారు. ఆ రోజుల్లో ఆయన సమాజంలో ఎన్నో కష్టాలు పడ్డారని చెప్పారు. మహిళల విద్యకి ప్రాధాన్యత ఇవ్వాలని.. అలాగే ఈ చిత్రాన్ని అందరికీ చూపించాలని కే కేశవరావు పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్
For National News And Telugu News