Share News

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్

ABN , Publish Date - May 25 , 2025 | 11:11 AM

యూఎస్ బృందానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను మోదీ ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Shashi Tharoor: పార్టీ కోసమే పని చేస్తున్నా.. క్లారిటీ ఇచ్చిన శశిథరూర్
Congress MP Shashi Tharoor

వాషింగ్టన్, మే 25: తాను ప్రభుత్వం కోసం పని చేయడం లేదని.. ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నానని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ ఎంపీ శశిథరూర్ కుండ బద్దలు కొట్టారు. ఇటీవల ఓ ప్రముఖ పత్రికలో ఒక కాలమ్ రాశానని ఆయన పేర్కొన్నారు. గట్టిగా కొట్టడమే కాకుండా తెలివిగా కొట్టాల్సిన సమయం అసన్నమైందని ఆ కాలమ్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ అదే పని చేసిందని చెప్పడానికి తాను సంతోషిస్తున్నానని చెప్పారు.

యూఎస్ పర్యటనలో భాగంగా శనివారం భారత కాన్సులేట్ కార్యాలయంలో ఎంపీ శశిథరూర్ మాట్లాడారు. ఉగ్రదాడి ద్వారా దేశాన్ని విభజించాలని భావించిన పాకిస్థాన్‌కు భారతీయుల ఐక్యత ఎలా ఉంటుందో తెలిసేలా చేసిందన్నారు. ఇంకా చెప్పాలంటే.. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నది.. ప్రజలను విభజించాలనే ప్రధాన ఉద్దేశ్యం అయినప్పటికీ.. అది దేశంలోని ప్రజలను ఏకతాటిపైకి తీసుకు వచ్చిందని ఆయన సుస్పష్టం చేశారు. భారతీయుల్లో అసాధారణ ఐక్యత ఉందని ఈ ఘటన ద్వారా తేటతెల్లమైందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు.


మే 7వ తేదీ తెల్లవారుజామున ఆపరేషన్ సిందూర్‌ను భారత్ చేపట్టిందని గుర్తు చేశారు. దీని ద్వారా పాకిస్థాన్‌తోపాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిందన్నారు. ఆ జాబితాలో లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ సంస్థలు సైతం ఉన్నాయని వివరించారు. ఉగ్రవాదంపై భారత్ తన స్పష్టమైన వైఖరిని ఈ ఉగ్రదాడి అనంతరం మరోసారి బహిర్గతమైందని వివరించారు.


సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ.. భారత్‌పై దాడులకు తెగబడేలా ఉగ్రవాద మూకలను పాకిస్థాన్ ప్రేరేపిస్తున్న సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ప్రపంచ దేశాలకు తెలియ జేయాలని మోదీ ప్రభుత్వం భావించింది. అందులోభాగంగా అన్ని రాజకీయ పార్టీలకు చెందిన ఎంపీలతో ఏడు బృందాలను కేంద్ర ప్రభుత్వం ఖరారు చేసింది. వాటిలో ఒక బృందానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్ నాయకత్వం వహించారు. ఈ బృందం ప్రస్తుతం యూఎస్‌లో పర్యటిస్తుంది. ప్రపంచంలో పాకిస్థాన్ ఏ విధంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందనే అంశంతోపాటు ఉగ్రవాదం వల్ల జరుగుతున్న అనర్థాలను ప్రపంచ దేశాలకు కేంద్రం ఏర్పాటు చేసిన ఈ బృందాలు వివరిస్తోన్నాయి.


ఇక యూఎస్ బృందానికి కాంగ్రెస్ పార్టీ ఎంపీ శశిథరూర్‌ను మోదీ ప్రభుత్వం ఎంపిక చేయడంపై ఆ పార్టీ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అదీకాక ఇటీవల శశిథరూర్.. మోదీ కేబినెట్‌లోని మంత్రితో సెల్ఫీ దిగారు. అలాగే ప్రధాని కేరళ పర్యటనలో భాగంగా శశిథరూర్‌తో వేదికను పంచుకున్నారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ కాస్తా గుర్రుగా ఉన్న సంగతి తెలిసిందే. దీంతో శశిథరూర్‌పై వేటు పడే అవకాశాలున్నాయంటూ ఒక ప్రచారం అయితే సాగుతోంది.


మరోవైపు పాక్ ఉగ్రవాదంపై ప్రపంచ దేశాలకు తెలియ జేసే బృందాల్లో ఎంపీల ఎంపికకు పేర్లు ఇవ్వాలంటూ ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి మోదీ ప్రభుత్వం సూచించింది. అయితే కాంగ్రెస్ ఇచ్చిన పేర్ల జాబితాలో శశిథరూర్ పేరు లేదు. కానీ శశిథరూర్‌ను ఒక బృందానికి నాయకత్వం వహించేలా కేంద్రం నిర్ణయించింది. దీంతో తాము ఇచ్చిన పేర్ల జాబితాలో లేని వారిని ఎందుకు ఎంపిక చేశారంటూ మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ మండిపడింది. 0ఈ నేపథ్యంలో శశిథరూర్ పై విధంగా వ్యాఖ్యానించారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక అమెరికాలో దిగిన శశిథరూర్ బృందం 9/11 ఘటనలో మృతి చెందిన వారి స్మారకాన్ని సందర్శించి.. వారికి ఘనంగా నివాళులర్పించిన విషయం విధితమే.

ఈ వార్తలు కూడా చదవండి..

భారీ వర్షాలు.. విమాన ప్రయాణికులకు కీలక సూచన..

తిరుపతిలో దారుణం.. అప్పు తీసుకున్న పాపానికి..

For National News And Telugu News

Updated Date - May 25 , 2025 | 11:14 AM