Night Time Economy: తెలంగాణలో రాత్రివేళా సంపద సృష్టి.. రేవంత్ సర్కారు వ్యూహరచన
ABN , Publish Date - Dec 03 , 2025 | 07:23 AM
తెలంగాణ రాజధాని భాగ్యనగరాన్ని మరింత సౌభాగ్యవంతంగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. రాత్రి వేళల్లోనూ సంపద సృష్టించేలా వ్యూహరచన చేస్తోంది. నైట్ టూరిజం, వైద్య, వెల్‌నెస్, ఆధ్యాత్మిక, హెరిటేజ్ తదితర విభాగాలను..
ఆంధ్రజ్యోతి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి సర్కారు తెలంగాణలో రాత్రి పూటా సంపద సృష్టించేలా చర్యలు ముమ్మరం చేయబోతోంది. ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో రాత్రి వేళల్లోనూ వ్యాపార, ఉద్యోగ, వాణిజ్య, సాంస్కృతిక, టూరిజం కార్యకలాపాలు మరింత పెంచేలా వ్యూహరచన చేస్తోంది. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ రాష్ట్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న నేపథ్యంలో తదననుగుణంగా రేవంత్ ప్రభుత్వం పటిష్టమైన ప్రణాళికలు రచిస్తోంది.
నైట్ ఎకానమీ పటిష్ట పరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం రాజధాని హైదరాబాద్‌లో రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యకలాపాలు, స్టేట్ ఫెస్టివల్స్, హెరిటేజ్ వాక్‌ల నిర్వహణ, ఫుడ్ కోర్ట్స్ ఏర్పాటు వంటి వాటితో సందర్శకులను ఆకట్టుకోవడమే కాకుండా పటిష్టమైన భద్రతతో ఎంఎస్‌ఎంఈ(MSME)లకు భరోసా కల్పించేందుకు దోహదపడేలా చర్యలు చేపట్టబోతున్నారు. ముఖ్యంగా మహిళలకు పటిష్టమైన భద్రతతో కూడిన వ్యవస్థను రూపొందిస్తోంది. వీటికి సంబంధించిన బుకింగ్‌లు, అనుమతుల కోసం సింగిల్ విండో ప్లాట్‌ఫాంలను అందుబాటులోకి తేవబోతోంది.
ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో దిగ్గజ ఐటీ కంపెనీలు, వ్యాపార సంస్థల్లో లక్షల మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ జీఎస్‌డీపీ(GSDP)లో హైదరాబాద్ చాలా కీలకం. ఈ నేపథ్యంలోనే నైట్ టైం ఎకానమీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూర్చేందుకు సీఎం రేవంత్ ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగా 8, 9 తేదీల్లో నిర్వహించే గ్లోబల్ సమిట్‌లో సమర్పించే తెలంగాణ రైజింగ్ విజన్-2047 డాక్యుమెంట్లో రానున్న 20 ఏళ్లలో ఎలాంటి వ్యూహాలు, ప్రణాళికలకు రూపకల్పన చేయాలనే అంశంపై నివేదిక సిద్ధం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
పట్టుబట్టి.. మంజూరు చేయించి...
Read Latest Telangana News and National News