Share News

TG Congress Party: బుంగమూతులు.. బుజ్జగింపులు

ABN , Publish Date - Jun 08 , 2025 | 09:29 PM

మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్,‌ మంత్రి జి వివేక్.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు.

TG Congress Party: బుంగమూతులు.. బుజ్జగింపులు

హైదరాబాద్, జూన్ 08: ఎట్టకేలకు అంటే.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొలువు తీరిన ఏడాదిన్నరకు మళ్లీ కేబినెట్ విస్తరించారు. ఆదివారం జరిగిన కేబినెట్ విస్తరణలో ముచ్చటగా ముగ్గురికే రేవంత్ రెడ్డి కేబినెట్‌లో చోటు దక్కింది. దీంతో తమకు మంత్రి పదవులు వస్తాయని భావించిన పలువురి ఆశలు ఆడియాసలు అయ్యాయి. దీంతో వారంతా అలక వహించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రంగంలోకి దిగి బుజ్జగింపు పర్వానికి తెర తీశారు. ఆ క్రమంలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి నివాసానికి పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ చేరుకుని ఆయన్ని బుజ్జగించారు. ప్రస్తుత పరిస్థితులు అర్థం చేసుకోవాలని ఈ సందర్భంగా అలకబూనిన నేతలకు బుజ్జగించే ప్రయత్నం చేశారు.


అనంతరం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి మాట్లాడుతూ.. మా మొరను పార్టీ అధిష్ఠానం వినలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్లపాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంతో కోట్లాడటం జరిగిందని గుర్తు చేశారు. కార్యకర్తలు లేకుండా మేం పని చేయలేమని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తల డిమాండ్ మేరకు మంత్రి పదవి అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ పార్టీని కాపాడింది మేమేనని ఈ సందర్భంగా ఆయన వివరించారు. మంత్రి పదవి వచ్చినా.. రాకున్నా.. పార్టీ లైన్‌లోనే ఉంటామని కుండ బద్దలు కొట్టారు.


పొరపాట్లు చేయవద్దని పార్టీ అధిష్ఠానాన్ని కోరుతున్నామని చెప్పారు. పార్టీలోకి కొత్తగా వచ్చిన వాళ్లకు మంత్రి పదవులు ఇస్తే.. కార్యకర్తలు బాధపడతారని పేర్కొన్నారు. తప్పులు చేయకుండా పార్టీ లైన్‌లో పని చేయాలని ఆయన పార్టీ కేడర్‌కు సూచించారు. వ్యక్తిగత నిర్ణయం తీసుకోవద్దని తెలిపారు. పది ఉమ్మడి జిల్లాలకు మంత్రి పదవులు ఇవ్వాలని ఈ సందర్బంగా ఆయన డిమాండ్ చేశారు. ఇచ్చిన జిల్లాలకే రెండు, మూడు మంత్రి పదవులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాకు గతంలో ఆరుగురు మంత్రులు ఉన్నారని గుర్తు చేశారు. పార్టీ పక్షానే తాను ఉంటానని ఈ సందర్భంగా ఆయన కుండ బద్దలు కొట్టారు. అధిష్ఠానానికి చెప్పుకోవడానికి అవకాశం ఇవ్వాలని పీసీసీ చీఫ్‌ను కోరామన్నారు. పార్టీ బాగోగుల కోసమే చెప్తున్నామన్నారు. పార్టీకి ఇబ్బందికర పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.


పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఏ నిర్ణయం తీసుకున్నా సమర్ధిస్తామని స్పష్టం చేశారు. కొట్లాడి అధికారంలోకి వచ్చాక పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. పార్టీకి చెప్పదలచుకున్న విషయాన్ని చెప్పానని స్పష్టం చేశారు. నా సామాజిక వర్గమే అడ్డుగా వస్తే.. పార్టీ కోసమైనా త్యాగం చేస్తానంటూ ఆయన తేల్చి చెప్పారు. పదవీ త్యాగానికి కట్టుబడి ఉన్నానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.


మరోవైపు మంత్రి పదవి రాకపోవడంతో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల బాధ్యురాలు మీనాక్షి నటరాజన్,‌ మంత్రి జి వివేక్.. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితో భేటీ అయ్యారు. సామాజిక సమీకరణాలతోపాటు పలు అంశాలు వల్ల కేబినెట్‌లో చోటు దక్కలేదని రాజగోపాల్ రెడ్డికి వారు వివరించినట్లు తెలిపారు. అలాగే సుదర్శన్ రెడ్డితోపాటు ప్రేమసాగరరావుల నివాసాలకు వీరు వెళ్లి.. వారిని సైతం బుజ్జగించినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

పట్టణ పేదరిక నిర్మూలనకు కృషి.. ఏపీ మెప్మాకు అవార్డుల పంట

ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు విడుదల

For Telangana News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 10:12 PM