Telangana Assembly: తెలంగాణ కేబినెట్ సమావేశం.. ఎస్సీ వర్గీకరణకు ఆమోదం
ABN , Publish Date - Feb 04 , 2025 | 11:54 AM
Telangana Assembly: ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. అయితే మంగళవారం అసెంబ్లీ ప్రత్యకంగా సమావేశం అయింది. ఈ సమావేశాల్లో కేబినెట్ ఎస్సీ వర్గీకరణకు ఆమోదం తెలిపింది.
హైదరాబాద్: కులగణన, ఎస్సీ వర్గీకరణ నివేదికలపై తెలంగాణ అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కేబినెట్ సమావేశం అనంతరం అసెంబ్లీ, మండలి ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. గ్రూప్ 1 - ఎస్సీల్లో అత్యంత వెనుకబడిన కులాలు సంచార కులాలు- 1శాతం, గ్రూప్ 2 - మాదిగ, మాదిగ ఉప కులాలు - 9శాతం, గ్రూప్ 3 --మాల మాల ఉపకులాలు -5శాతం ఉన్నాయి. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన వెంటనే వాయిదా పడ్డాయి.
మధ్యాహ్నం రెండు గంటల వరకు అసెంబ్లీ వాయిదా పడింది. కేబినెట్ సమావేశం నడుస్తున్నందున కాసేపు సభను వాయిదా వేయాలని అసెంబ్లీ వ్యవహారాల మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు కోరారు. మధ్యాహ్నం 2 గంటలకు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ వాయిదా వేశారు. కులగణన సర్వే, ఎస్సీ వర్గీకరణపై కేబినెట్ సమావేశంలో లఘుచర్చ జరిగింది. అయితే మధ్యాహ్నం అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి కీలక ప్రకటన చేయనున్నారు. శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రకటన చేస్తారు. కుల గణన, బీసీ రిజర్వేషన్ల పెంపుపై తీర్మానం చేసి.. కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం పంపనుంది.
కాగా, ఆగస్టు1, 2024న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దీంతో ఎస్సీ వర్గీకరణ అమలు చేయడం కోసం తెలంగాణ ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని నియమించింది. సబ్ కమిటీ సూచనతో రాష్ట్ర హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి షమీం అక్తర్ నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ నియమించింది. దీంతో జస్టిస్ షమీం అక్తర్ కమిషన్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటించి ఎస్సీ వర్గీకరణపై నివేదికను సిద్ధం చేసింది. ఫైనల్ రిపోర్టును కమిషన్ సోమవారం సబ్ కమిటీకి అందజేసిన విషయం తెలిసిందే.