Balakrishna: బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకలు.. బాలయ్య కీలక వ్యాఖ్యలు
ABN , Publish Date - Jun 22 , 2025 | 01:45 PM
హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సిల్వర్ జూబ్లీ వేడుకులు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.
హైదరాబాద్, జూన్ 22: డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ పేరుతో సినిమా తెరకెక్కించాలని భావిస్తున్నట్లు హిందూపురం ఎమ్మెల్యే, బసవతారకం ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ వెల్లడించారు. అయితే ఆ చిత్రానికి దామోదర రాజనర్సింహ టైటిల్ కాకుండా దబిడి దిబిడి రాజనర్సింహ అని టైటిల్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపారు. ఆదివారం హైదరాబాద్‌లో బసవతారకం ఆసుపత్రి 25 ఏళ్లు వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో పాల్గొన్న ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ.. ఈ ఆసుపత్రిని డబ్బులు, లాభాల కోసం ఏర్పాటు చేసింది కాదన్నారు. వ్యక్తిగత నష్టం వల్ల కలిగిన ఆలోచన నుంచి పుట్టిందని తెలిపారు.

తన తల్లి క్యాన్సర్‌తో చనిపోయిందని.. దీంతో అందరికి క్యాన్సర్ చికిత్స అందించాలనే లక్ష్యంతో తన తండ్రి ఎన్టీఆర్ ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేశారని వివరించారు. 110 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన ఈ హాస్పిటల్ నేడు స్టేట్ ఆఫ్ ఆర్ట్ పరికరాలతో దేశంలోనే అత్యున్నత ఆసుపత్రుల్లో ఒకటిగా నిలిచిందని గుర్తు చేశారు. అయితే తమకు పూర్తి సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభూత్వానికి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు ఈ సందర్భంగా ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏపీలో కూడా సహకారం అందిస్తున్న ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. వెయ్యి బెడ్స్‌తో త్వరలో అమరావతిలో ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. 300 బెడ్స్‌తో తొలి దశలో ఈ ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్పారు.

ఇక రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ మాట్లాడుతూ.. క్యాన్సర్‌తో మృతి చెందిన బసవతారకం పేరిట ఆమె భర్త ఎన్టీఆర్ 25 ఏళ్ల కిందట ఈ హాస్పటల్‌ను ప్రారంభించారని వివరించారు. నాటి నుంచి నేటి వరకూ లక్షల మంది పేషెంట్లకు ఈ హాస్పిటల్ వైద్య సేవలు అందిస్తోందని గుర్తు చేశారు. ఎన్టీఆర్ ఐకానిక్ లీడర్, లెజెండరీ యాక్టర్ అని అభివర్ణించారు. సినిమా, సామాజిక సేవలో ఆయన చేసిన కృషి నేటి తరానికి స్ఫూర్తిదాయకమన్నారు. నాటి ఆయన విజనే నేటి ఈ హాస్పిటల్ అన్నారు.

లక్షలాది మంది పేద రోగులకు వారి జీవితంపై ఆశ, నమ్మకాన్ని ఈ ఆసుపత్రి కలిగిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా క్యాన్సర్ సమస్య పెరుగుతోందని ఈ సందర్భంగా మంత్రి దామోదర రాజనరసింహ ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రతి ఏటా 50 నుంచి 55 వేల మందికి కొత్తగా క్యాన్సర్ బారిన పడుతున్నారని వివరించారు. ఇవి కేవలం నంబర్లు కాదని.. రోగుల జీవితాలను, వారి కుటుంబాలను తీవ్రంగా ప్రభావితం చేసే ప్రమాదకర వ్యాధి ఇదని ఆయన అభివర్ణించారు.

ఎర్లీ స్టేజ్‌లో గుర్తిస్తేనే ఈ వ్యాధిని నయం చేయగలమన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ యూనిట్లను ప్రారంభించబోతున్నామన్నారు. ప్రతి జిల్లాల్లో క్యాన్సర్ కేర్ సెంటర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించామని చెప్పారు. త్వరలోనే వీటిని ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. క్యాన్సర్ స్క్రీనింగ్, డయాగ్నొసిస్, డే కేర్ కీమోథెరపి, పాలియేటివ్ కేర్ వంటి సేవలన్నీ ఈ సెంటర్లలో అందిస్తామని చెప్పారు. ఇంకా అడ్వాన్స్‌డ్ వైద్య సేవలు అందించేలా రీజనల్ కేన్సర్ కేర్ సెంటర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నామన్నారు.
పేద పేషెంట్లకు సేవలు అందిస్తున్న బసవతారకం వంటి హాస్పిటళ్లకు ప్రభుత్వం తరపున అవసరమైన సహకారం అందిస్తామని ఈ సిల్వర్ జూబ్లీ వేడుకల ద్వారా తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు. ఎన్‌టీఆర్ స్థాపించిన ఈ హాస్పిటల్‌ను నడిపిస్తూ, పేదలకు సేవలు అందిస్తున్న నందమూరి బాలకృష్ణకు ఈ సందర్భంగా ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, బసవతారకం ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
రన్‌వేపై విమానం.. ఆందోళనలో ప్రయాణికులు
అంబటి రాంబాబుపై మళ్లీ కేసులు నమోదు
For Telangana News And Telugu News