Talasani: అది 'సిగ్గులేని సంసారం': తలసాని శ్రీనివాస్ యాదవ్
ABN , Publish Date - Dec 20 , 2025 | 03:44 PM
సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్ నేత తలసాని ఫైరయ్యారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కొట్టివేసిన నేపథ్యంలో..
హైదరాబాద్, డిసెంబర్ 20: కాంగ్రెస్‌లో చేరినా బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెప్పుకునే ఆ పది మంది ఎమ్మెల్యేల జీవితం 'సిగ్గులేని సంసారం'అంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హాట్ కామెంట్ చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.
స్పీకర్ విచిత్రమైన తీర్పు ఇచ్చారని, ఆ ఎమ్మెల్యేలు బీఆర్‌ఎస్‌లో ఉంటే తమతోపాటు వచ్చి కూర్చోవాలని సవాల్ విసిరారు. 'చేర్చుకున్న వాళ్లు మా వాళ్లు కాదు' అని కాంగ్రెస్ చెబుతోందని ఎగతాళి చేశారు. కేసీఆర్.. తెలంగాణ సాధన వల్లే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని, లేకపోతే వారికి పదవులే లేవని తలసాని చెప్పారు.
'ఇంకా రెండేళ్లే... తర్వాత మనమే వస్తాం. ఎలా డ్యాన్స్ ఆడిస్తామో అలా ఆడిస్తాం' అని తలసాని హెచ్చరికలు జారీ చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా సీఎం రేవంత్ రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల హామీతో కాంగ్రెస్ మోసం చేసిందని, సంక్షేమ నిధులు ఎమ్మెల్యేల ఇళ్ల నుంచి వస్తున్నాయా అని ప్రశ్నించారు.
సచివాలయం, ప్రజాభవన్ బాగాలేవని కాంగ్రెస్ అంటోంది.. మరి.. రోజూ అక్కడే ఎందుకు కూర్చొంటారని తలసాని ఎద్దేవా చేశారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఇలాంటి దరిద్రమైన ప్రభుత్వం చూడలేదని తలసాని అన్నారు. రాష్ట్రంలో 25 ఏళ్ల వరకు కాంగ్రెస్ అనే మాటే రాదని తలసాని జోస్యం చెప్పారు.
ఇవి కూడా చదవండి:
ఉదయం పూట ఇలా చేస్తారా.. చిన్నతనంలోనే వార్ధక్య లక్షణాలు వస్తాయి జాగ్రత్త!
నా కుమారుడు రోజూ ఉదయం 4 గంటలకే నిద్ర లేస్తాడు: నటుడు మాధవన్