CM Revanth Reddy: భూ భారతి అమలు కావాలంటే.. జీపీవోల పాత్ర కీలకం
ABN , Publish Date - Sep 05 , 2025 | 07:35 PM
తెలంగాణ తొలి సీఎం మన బతుకులు మారుస్తారని మనమంతా నమ్మామన్నారు. కానీ రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందంటూ గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 05: రెవెన్యూ శాఖలో మెరుగైన సేవల కోసం గ్రామ పాలన అధికారుల(జీపీవో)ను నియమించినట్లు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో రెవెన్యూ సిబ్బందిది కీలక పాత్ర పోషించారని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో 'కొలువుల పండుగ' కార్యక్రమంలో భాగంగా గ్రామ పాలన అధికారుల(జీపీవో)కు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలు అందజేశారు.
అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం మన బతుకులు మారుస్తారని మనమంతా నమ్మామన్నారు. రెవెన్యూ ఉద్యోగులను దొంగలుగా చిత్రీకరించిందంటూ గత కేసీఆర్ ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను దోచుకున్నది రెవెన్యూ ఉద్యోగులే అన్నట్లుగా చిత్రీకరించిందని ఆయన విమర్శించారు.
భూమికి, తెలంగాణ ప్రజలకు విడదీయరాని అనుబంధం ఉందని ఈ సందర్బంగా ఆయన అభిప్రాయపడ్డారు. చరిత్రలో భూమి చుట్టు జరిగిన ఉద్యమాలు ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే పోడు భూముల పంపిణీ చేసిందని గుర్తు చేశారు.
గత పాలకులు భూములను కొల్లగొట్టేందుకే ధరణిని తీసుకొచ్చారని ఆరోపించారు. భూ సమస్యలు పరిష్కారం కాకుండా మిమ్మల్ని బలి పశువులను చేశారంటూ ప్రజలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఆ పాపాలు బయటకు వస్తాయనే వీఆర్వో, వీఆర్ఏలను తొలగించారని వివరించారు.
ధరణి అనే భూతాన్ని అంతం చేస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చామని.. అందుకు తగ్గట్టుగానే దానిని బంగాళాఖాతంలో కలిపేశామన్నారు. భూములు ఆక్రమించాలనుకున్న వారిని ప్రజలు తరిమికొట్టారని తెలిపారు. భూభారతి చట్టం పక్కాగా అమలు కావాలంటే జీపీవోల పాత్ర కీలకమని ఆయన స్పష్టం చేశారు.
ఏదో తప్పు జరిగిందని రెవెన్యూ వ్యవస్థను రద్దు చేశారంటూ బీఆర్ఎస్ నేతలపై మండిపడ్డారు. చిన్న తప్పు జరిగితే వ్యవస్థ మొత్తాన్ని రద్దు చేస్తారా? అంటూ బీఆర్ఎస్ నేతలను ఆయన సూటిగా ప్రశ్నించారు. గత పాలకులు కట్టిన కాళేశ్వరం.. కూలేశ్వరం అయిందని వ్యంగ్యంగా అన్నారు. మరి కాళేశ్వరం కూలినందుకు బీఆర్ఎస్ పార్టీని రద్దు చేస్తారా? అంటూ ఆ పార్టీ అగ్రనాయకత్వాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఈ వేదికగా నిలదీశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఫలించిన ప్రభుత్వ ప్రయత్నం.. తెలంగాణకు యూరియా రాక..
మద్యం కుంభకోణం కేసులో కీలక పురోగతి
Read Latest TG News and National News