Share News

CM Revanth reddy: కేసీఆర్ కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్

ABN , Publish Date - Dec 21 , 2025 | 09:21 PM

గోదావరిలో 71% వాటా కోసం తాము కొట్లాడుతున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇంకా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సుయోధనుడిలాగా ఏకపాత్రాభినయం చేస్తున్నారని ఆయన వ్యంగ్యంగా పేర్కొన్నారు.

CM Revanth reddy: కేసీఆర్ కామెంట్స్.. సీఎం రేవంత్ రెడ్డి రియాక్షన్
TG CM Revanth Reddy

హైదరాబాద్, డిసెంబర్ 21: రాష్ట్రంలోని నదీ జలాలపై చర్చిద్దామని.. అందుకోసం అసెంబ్లీకి రావాలని బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కేసీఆర్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే అత్యధికంగా జల దోపిడి జరిగిందని ఆయన విమర్శించారు. మూడు జిల్లాలకు మరణ శాసనం రాసిందే కేసీఆర్ ఆని ఆయన స్పష్టం చేశారు. పాలమూరు - రంగారెడ్డికి జూరాల నుంచి నీటిని తీసుకుంటే మన హక్కులు మనకు ఉండేవని ఆయన పేర్కొన్నారు.


అసెంబ్లీకి రండి.. చర్చిద్దాం..

ఆదివారం తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్‌ఎల్‌పీ సమావేశం అనంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై పలు విమర్శలు సంధించారు. కేసీఆర్ వ్యాఖ్యలపై మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కాంట్రాక్టర్లకు అమ్ముడుపోయి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మించారంటూ కేసీఆర్‌పై మండిపడ్డారు. 2026, జనవరి 02వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నదీ జలాల నిజాలపై అసెంబ్లీ వేదికగా చర్చిద్దామంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.


ఏకపాత్రాభినయం చేస్తున్న కేసీఆర్..

కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పాలమూరు రంగారెడ్డి డీపీఆర్ సైతం సరిగ్గా సమర్పించ లేదని స్పష్టం చేశారు. తెలంగాణకు 299 టీఎంసీలు చాలని సంతకం చేసిందే కేసీఆర్ అని గుర్తు చేశారు. గోదావరిలో 71% వాటా కోసం తాము కొట్లాడుతున్నామని వివరించారు. ఇంకా ప్రజలను మోసం చేయడానికి కేసీఆర్ సుయోధనుడిలాగా ఏకపాత్రాభినయం చేస్తున్నారని వ్యంగ్యంగా అన్నారు.


ఆ అధికారిపై విచారణ.. ఎందుకు అనుమతి రావడం లేదు?

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఆర్థిక ఉగ్రవాది అని అభివర్ణించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ఆయన కుప్పకూల్చారంటూ కేసీఆర్‌పై సీఎం రేవంత్ నిప్పులు చెరిగారు. నాలుగు రకాలుగా రూ. ఎనిమిది లక్షల కోట్లు అప్పులు చేశారని వివరించారు. దానిని తాము సరి చేస్తున్నామన్నారు. ప్రధాని మోదీ ఎరువు పంపించగానే కేసీఆర్ కోలుకొని బయటకు వచ్చారని పేర్కొన్నారు. కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి అనుమతి ఎందుకు రావడం లేదంటూ కేసీఆర్‌ను ఆయన సూటిగా ప్రశ్నించారు. ఐఏఎస్ సీనియర్ అధికారి అరవింద్ కుమార్‌పై విచారణకు డీఓపీటీ నుంచి ఎందుకు అనుమతి రావడం లేదంటూ సందేహం వ్యక్తం చేశారు.


కొత్త బట్టలు కుట్టించుకున్న కేటీఆర్..

కేసీఆర్ ఆరోగ్యంగా ఉండాలని.. ఆయన అసెంబ్లీకి రావాలని తాను కోరుకుంటున్నానన్నారు. కేసీఆర్ పోవాలని కోరుకుంటున్నదే కేటీఆర్, హరీష్ రావు అని ఎద్దేవా చేశారు. వీళ్లిద్దరు కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనుకుంటున్నారని తెలిపారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కోసం కేటీఆర్ కొత్త బట్టలు కుట్టించుకున్నారని చెప్పారు.


ఐరన్ లెగ్ అని తెలిపోయింది..

కేసీఆర్ పోయిన తర్వాత.. నా దారి నాదేనంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పకనే చెప్పాడని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు. కేటీఆర్ ఐరన్ లెగ్ అని తేలిపోయిందంటూ ఎద్దేవా చేశారు. పార్టీ పగ్గాలు హరీష్ రావుకు అప్పగించాలనే వాదన బీఆర్ఎస్ పార్టీలో ప్రారంభమైందన్నారు. బీఆర్ఎస్‌ను హస్తగతం చేసుకుంటే రూ.5,300 కోట్ల పార్టీ ఆస్తులు తనకు దక్కుతాయని హరీష్ రావు చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.


ఆయన చనిపోతే నాకేమీ వస్తుంది..

ఈ రోజు కేసీఆర్ మాట్లాడిన భాష ఆయన వయసుకు తగినది కాదని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఆయన విసనకర్రతో ఇట్లంటే నేను ఈలపీఠతో అట్లంట అని స్పష్టం చేశారు. కేటీఆర్ ఆయన తండ్రి కుర్చీ కోరుకుంటుంటే.. హరీష్ రావు ఆయన చావు కోరుకుంటున్నాడని పేర్కొన్నారు. అయినా కేసీఆర్ చావును నేనెందుకు కోరుకుంటా అంటూ సీఎం రేవంత్ రెడ్డి ఎదురు ప్రశ్నించారు. ఆయన చనిపోతే నాకేమీ వస్తుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్ ఆసుపత్రిలో ఉంటే.. వెళ్లి పరామర్శించి వచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా సీఎం రేవంత్ గుర్తు చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ పాలు తాగితే.. షుగర్, బీపీ, కొలెస్ట్రాల్, అలర్జీ.. అన్ని దూరం

నక్సలిజం కారణంగానే ఛత్తీస్‌గఢ్ వెనకబడింది: సీఎం

For More TG News And Telugu News

Updated Date - Dec 21 , 2025 | 10:14 PM