Share News

Heavy Rains: కబ్జాలపై ఫుల్ ఫోకస్: మంత్రి పొన్నం

ABN , Publish Date - Aug 10 , 2025 | 07:29 PM

వర్షపు నీటి సంరక్షణపై దృష్టి సారించాలని హైదరాబాద్ వాసులకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. దీని వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఎండాకాలంలో ఆ నీరు తిరిగి మనకు ఉపయోగపడుతుందని ఆయన వివరించారు.

Heavy Rains: కబ్జాలపై ఫుల్ ఫోకస్: మంత్రి పొన్నం
TG Minister ponnam Prabhakar

హైదరాబాద్, ఆగస్ట్ 10: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో అన్ని ప్రభుత్వ శాఖల సమన్వయంతో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ముఖ్యంగా హైదరాబాద్‌లో వర్షాలు, వరదలపై ప్రజలకు ఎప్పటికప్పుడు మెసేజ్‌ల ద్వారా అలర్ట్ ఇస్తున్నామని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా ఆయన ప్రజలకు సూచించారు. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ మహా నగరంలో ఏర్పడిన సమస్యలపై ఉన్నతాధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు.


అనంతరం మంత్రి పొన్నం విలేకర్లతో మాట్లాడుతూ.. ఓఆర్ఆర్ లోపల వర్షాల కారణంగా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. వరదలు, ఇబ్బందులు అనేవి ఇవాళ ఒక్క రోజే ఏర్పడిన సమస్య కాదని ఆయన పేర్కొన్నారు. 1931 జనాభాకు అనుగుణంగా పెట్టిన వ్యవస్థ నేటికీ పని చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో తాగు నీరు, డ్రైనేజీ వ్యవస్థపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. జీహెచ్ఎంసీ, రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, హైడ్రా, వాటర్ బోర్డ్, ట్రాఫిక్ తదితర శాఖలన్నీ సమన్వయంతో పని చేస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు.


141 వాటర్ లాగింగ్ పాయింట్స్‌లో 84 పూర్తయ్యాయన్నారు మంత్రి పొన్నం. మిగిలిన పాయింట్స్ పై చర్యలు సైతం తీసుకుంటామని చెప్పారు. అయితే ప్రభుత్వం ఎంత చేస్తున్నా.. ప్రజల వైపు నుంచి సహకారం సైతం కావాలన్నారు. ఇక నగరంలోని అన్ని ప్రాంతాల్లో వాటర్ లాగింగ్ పాయింట్స్ పై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇక, నగరంలో కబ్జా, ఆక్రమణలపై స్పెషల్ ఫోకస్ పెట్టామని తెలిపారు.


హైడ్రాకు అధికారం ఇచ్చి.. అన్ని రకాల చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చామన్నారు. ప్రకృతి వల్ల జరుగుతుంది కాబట్టి అందరం కలిసి పని చేసేందుకు సిద్దంగా ఉన్నామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ప్రజల కోసం అప్రమత్తంగా పని చేయాలని అధికారులకు ఈ సందర్భంగా మంత్రి సూచించారు.


వర్షం నీళ్లు వృథా కాకుండా.. వాటిని పరిరక్షించాలన్నారు. వర్షపు నీటి సంరక్షణపై దృష్టి సారించాలని నగరంలోని అపార్ట్‌మెంట్ వాసులకు ఆయన సూచించారు. దీని వల్ల గ్రౌండ్ వాటర్ పెరిగి ఎండాకాలంలో ఆ నీరు తిరిగి మనకు ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా మంత్రి పొన్నం వివరించారు.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆ నియోజకవర్గాన్ని కృష్ణాజిల్లాలోనే కొనసాగించండి

వారి అరెస్ట్‌కు కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది: పట్టాభి

For More Telangana News And Telugu News

Updated Date - Aug 10 , 2025 | 08:47 PM