Ambula Vaishnavi: ఆ నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించండి: అంబుల వైష్ణవి..
ABN , Publish Date - Aug 10 , 2025 | 06:41 PM
కైకలూరు అసెంబ్లీ స్థానాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గంలోని ఉద్యోగులు, విద్యార్థుల బాధలు వర్ణణాతీతం అన్నారు.
ఏలూరు, ఆగస్ట్ 10: కైకలూరు నియోజకవర్గాన్ని కృష్ణా జిల్లాలోనే కొనసాగించాలని రాజధాని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయంతో సాగు, తాగు నీరుకు కైకలూరు ప్రాంత రైతులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నియోజకవర్గాన్ని ఏలూరు జిల్లాలో విలీనం చేయడం వల్ల నీటి యుద్ధాలు తప్పవని గతంలో ఈ నియోజకవర్గ ప్రజలు వేడుకున్నా.. గత ప్రభుత్వం వారి మాటలను మాత్రం పట్టించుకోలేదని గుర్తు చేశారు.
ఆదివారం నాడు కైకలూరులో అంబుల వైష్ణవి విలేకర్లతో మాట్లాడుతూ.. భౌగోళికంగా ప్రభుత్వ శాఖలన్నీ కృష్ణా జిల్లాలోనూ పరిపాలన ఏలూరు జిల్లాలో జరగడంతో ఈ ప్రాంత ప్రజలతోపాటు ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఈ మేరకు కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాలను తిరిగి కృష్ణా జిల్లాలో కలిపేందుకు ఏర్పాటు చేసిన సబ్ కమిటీతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వినతిపత్రం అందజేస్తానని అంబుల వైష్ణవి స్పష్టం చేశారు.
అలాగే ప్రజా రాజధాని అమరావతి నిర్మాణంలో భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ఆమె పిలుపు నిచ్చారు. ఆ క్రమంలో ప్రతి ఒక్కరూ రూ.116 విరాళం అందించి రాజధాని నిర్మాణానికి సహకరించాలని అమరావతి బ్రాండ్ అంబాసిడర్ అంబుల వైష్ణవి విజ్ఞప్తి చేశారు.
ఎవరీ అంబుల వైష్ణవి..
గతంలో రాజధాని అమరావతి పరిరక్షణ సమితి (ఐకాస) నేతలకు కృష్ణాజిల్లా ముదినేపల్లికి చెందిన అంబుల వైష్ణవి ఎకరం భూమి విరాళంగా అందజేశారు. తన తండ్రి నుంచి ఆమెకు సంక్రమించిన ఆస్తిలో ఎకరం భూమికి సంబంధించిన పత్రాలను టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అందజేశారు.
అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రాజధాని అమరావతి నిర్మాణం కోసం తన వంతుగా అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడికి రూ.లక్ష విరాళంగా అందజేశారు. దీంతో రాజధాని బ్రాండ్ అంబాసిడర్‌గా అంబుల వైష్ణవి పేరును సీఎం చంద్రబాబు ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం తాను చదువుకుంటున్న పాఠశాలను రూ.4లక్షలతో అభివృద్ధి చేసింది. అలాగే 400 మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిక్షించాలని గతంలో పిలుపునిచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హైదరాబాద్‌లో సీఎం ఆకస్మిక పర్యటన
జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డిపై చర్యలకు రంగం సిద్ధం..!
For More AndhraPradesh News And Telugu News