Hyderabad Fire Accident: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. పీఎం, తెలుగు రాష్ట్రాల సీఎంల తీవ్ర దిగ్భ్రాంతి
ABN , Publish Date - May 18 , 2025 | 12:25 PM
Hyderabad Fire Accident: భాగ్యనగరంలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది మృతిచెందారు. పలువురు ప్రముఖులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
హైదరాబాద్: భాగ్యనగరంలో తీవ్రవిషాదం నెలకొంది. పాతబస్తీలో ఆదివారం జరిగిన అగ్నిప్రమాదంలో (Hyderabad Fire Accident) 17 మంది మృతిచెందారు. భవనంలో ఏసీ కంప్రెషర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించింది. ఘటనాస్థలంలోనే ముగ్గురు మృతి చెందగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో 14 మంది మృతిచెందారు. మలక్‌పేట యశోద, ఆపోలో డీఆర్డీవో ఆస్పత్రుల్లో క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు రేవంత్‌రెడ్డి, నారా చంద్రబాబు నాయడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, పలువురు నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారు వీరే..
ప్రహ్లాద్ (70)
మున్ని (70)
రాజేందర్ మోదీ (65)
సుమిత్ర (60)
హమేయ్ (7)
అభిషేక్ (31)
శీతల్ (35)
ప్రియాన్ష్ (4)
ఇరాజ్ (2)
ఆరూష్ (3)
రిషబ్ (4)
ప్రథమ్ (1.5)
అనుయాన్ ( 3)
వర్ష (35)
పంకజ్ (36)
రజిని (32)
ఇడ్డు (4)
కేంద్రం పరిహారం..
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పారు. సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాద బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది. మృతుల కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున పరిహారం ప్రకటించింది.
అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి
పాతబస్తీ అగ్నిప్రమాదంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు సరైన వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం రేవంత్‌రెడ్డి సూచించారు.
క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి: సీఎం చంద్రబాబు
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదంపై ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదంపై కలచివేసింది: పవన్ కల్యాణ్
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం కలచివేసిందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ప్రమాదంలో 17 మంది మృతిచెందడం బాధాకరమని చెప్పారు. బాధిత కుటుంబాలను తెలంగాణ ప్రభుత్వం ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ ట్వీట్ చేశారు.
ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణం: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
అగ్నిప్రమాద ఘటనాస్థలిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి పరిశీలించారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్ కారణమని అన్నారు. ప్రమాదం చిన్నదే అయినా ప్రాణనష్టం ఎక్కువగా ఉందని చెప్పారు. సహాయక చర్యల్లో ఫైర్ సిబ్బంది ఆలస్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారని అన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఫైర్‌సిబ్బందికి సరైన పరికరాలు ప్రభుత్వం అందించాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలోని గుల్జార్ హౌస్ వద్ద జరిగిన అగ్నిప్రమాదంలో 17మందికి పైగా మరణించడం బాధాకరమని చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని ప్రమాదంపై ఆరా తీశానని అన్నారు. మృతుల్లో చిన్నారులు సైతం ఉండటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని చెప్పారు. గాయపడ్డవారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పందించారని తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షల ఎక్స్‌గ్రేషియా, క్షతగాత్రులకు రూ.50 వేల ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు చెప్పారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి.. మరోసారి నగరంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కోరారు.
బాధిత కుటుంబాలకు మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శ
అగ్నిప్రమాద ఘటనస్థలాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. అధికారులతో మాట్లాడి ప్రమాద వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను మంత్రి పొన్నం ప్రభాకర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. అగ్నిప్రమాదం సీఎం రేవంత్‌రెడ్డి ఆరా తీశారని అన్నారు. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదని తెలిపారు. ప్రమాదం జరిగిన 15నిమిషాలకే ఫైర్ సిబ్బంది చేరుకున్నారని చెప్పారు. ఈ ఘటనపై ఎవరూ రాజకీయం చేయొద్దని అన్నారు. బాధిత కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు.
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం బాధాకరం: మహేష్‌గౌడ్
గుల్జర్‌హౌస్ అగ్నిప్రమాదం బాధాకరమని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు.
అగ్నిప్రమాదంపై మంత్రి నారా లోకేష్ తీవ్ర దిగ్భ్రాంతి..
హైదరాబాద్‌లోని చార్మినార్ పరిధి గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 17 మంది దుర్మరణం పాలవడం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. భవనం మొదటి అంతస్తులో చెలరేగిన మంటల్లో చిన్నారులు, మహిళలతో సహా పలువురు మరణించడం విషాదకరమని చెప్పారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు భగవంతుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకుంటున్నానని అన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని నారా లోకేష్ తెలిపారు.
త్వరగా కోలుకోవాలి: హోంమంత్రి అనిత
అమరావతి: హైదరాబాద్‌లో ఘోర అగ్నిప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ హోం,విపత్తు నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్త చేశారు. గుల్జార్‌హౌస్ సమీపంలోని భవనంలో అగ్ని ప్రమాదం సంభవించడం చాలా బాధాకరమని చెప్పారు. ఈ దుర్ఘటనలో 17 మంది మృతి చెందారన్న వార్త కలచివేసిందని చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు. మృతిచెందిన కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలు ఈ ఘటన నుంచి త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. ఎండలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలు అగ్నిప్రమాదల పట్ల అప్రమత్తంగా ఉండాలని వంగలపూడి అనిత సూచించారు.