Share News

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు

ABN , Publish Date - Dec 26 , 2025 | 11:23 AM

ఫోన్ ట్యాపింగ్‌ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు ఇంటికి వెళ్లిపోయారు. కస్టోడియల్ విచారణ ముగియడంతో వైద్య పరీక్షల నిమిత్తం ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Phone Tapping Case: ముగిసిన విచారణ.. ఇంటికి ప్రభాకర్ రావు
Phone Tapping Case

హైదరాబాద్, డిసెంబర్ 26: ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌ రావు (Prabhakar Rao) కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈరోజు (శుక్రవారం) ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రభాకర్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల తర్వాత ప్రభాకర్ ఇంటికి వెళ్లిపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. ఆయన స్టేట్‌మెంట్‌ను ఫైనల్ ఛార్జ్ షీట్‌లో పొందుపర్చనున్న సిట్.. జనవరి 16న సుప్రీంకోర్టుకు నివేదిక ఇవ్వనున్నారు.


ఫోన్ ట్యాపింగ్ కేసు తుది అంకానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈకేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావును సిట్ దర్యాప్తు బృందం 14 రోజుల పాటు విచారించింది. మొదటి దశలో డిసెంబర్ 12 నుంచి 18 వరకు ప్రభాకర్ రావును విచారించింది సిట్ బృందం. అయితే విచారణలో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ సిట్‌కు సహకరించలేదని.. అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ 19 నుంచి 25 వరకు మరోసారి కస్టోడియల్ విచారణకు సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మొత్తం 14 రోజుల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. ఈ కేసులో మిగిలిన నిందితులుగా ఉన్న తిరుపతన్నరావు, భుజంగరావు, రాధాకిషన్ రావును విచారించినట్లు తెలుస్తోంది. వీరందరినీ వేర్వేరుగా సిట్ అధికారులు విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసినట్లు సమాచారం.


అప్పట్లో ప్రభాకర్ రావు ఎస్‌ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో అప్పటి మాజీ మంత్రి హరీష్‌రావును ఎందుకు కలిశారని ప్రశ్నించగా.. అతనికి ప్రాణహానీ ఉండటంతో రక్షణ కోసం కల్పించడం కోసమే కలిసినట్లు సిట్ అధికారుల ఎదుట ఒప్పుకున్నారు. వీటితో పాటు ప్రభాకర్ రావు పదవీవిరమణ అయినప్పటికీ పదవిని కొనసాగించడంలో ఆంతర్యమేంటి అనే దానిపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అయితే అప్పటి సీఎంగా పనిచేసిన కేసీఆర్‌కే తెలియాలంటూ సిట్ అధికారులకే ప్రభాకర్ రావు ఎదురు ప్రశ్న వేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి అప్పట్లో మంత్రిగా పనిచేసిన హరీష్‌రావుతో పాటు మాజీ సీఎం కేసీఆర్‌ను కూడా విచారించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. గతంలో ఆరువేల ఫోన్ నెంబర్లు ట్యాపంరింగ్ చేసి రాజకీయ నేతలతో పాటు వ్యాపారవేత్తలను బెదిరించి వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. ఆర్థిక లావాదేవీలపై ప్రభాకర్ రావు బంధువుల స్టేట్‌మెంట్‌‌ను కూడా రికార్డ్ చేసినట్లు తెలుస్తోంది. నెలలోపు ఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించి దర్యాప్తును పూర్తి చేయాలని కొత్తగా ఏర్పడిన సిట్ బృందానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో జనవరి 16లోపు పూర్తి వివరాలు రాబట్టేందుకు సిట్ బృందం ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..

అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 26 , 2025 | 11:40 AM