Hyderabad: అనుమానంతో భార్యకు నిప్పు పెట్టిన భర్త.. అడ్డుకోబోయిన కూతురిని కూడా
ABN , Publish Date - Dec 26 , 2025 | 10:17 AM
హైదరాబాద్‌లోని నల్లకుంటలో దారుణ ఘటన జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను.. భర్త అతికిరాతంగా హత్య చేశాడు.
హైదరాబాద్, డిసెంబర్ 26: నగరంలోని నల్లకుంటలో (Nallakunta) దారుణం జరిగింది. అనుమానంతో కట్టుకున్న భార్యను దారుణంగా హత్య చేశాడు భర్త. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే..
నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన దంపతులు వెంకటేశ్, త్రివేణి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వెంకటేశ్ తరచూ అనుమానిస్తుండే వాడు. ఈ విషయంపై భార్యను తీవ్రంగా వేధించేవాడు. వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడికి వెళ్లిన వెంకటేశ్.. తాను మారానని, ఇకపై బాగా చూసుకుంటానంటూ నమ్మించి త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చిన కొద్దురోజులకే ఆమెను అతి దారుణంగా చంపేశాడు. ఎప్పటిలాగే అనుమానంతో భార్యతో గొడవకు దిగి విచక్షణ మరిచి ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు.
అడ్డుకున్న కూతురినీ మంటల్లో తోసేసిన వెంకటేశ్ అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేసి ఇద్దరినీ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించారు. కేవలం 12 గంటల్లోనే వెంకటేశ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా.. బాగా చూసుకుంటానని నమ్మించి తమ కుమార్తెను ఇలా దారుణంగా చంపేశాడంటూ త్రివేణి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అనుమానంతో భార్యను హత్య చేసి భర్త జైలు పాలవడంతో.. ఇద్దరు చిన్నారులు అనాధలుగా మిగిలిపోయారు. తల్లి కోసం చిన్నారులు విలపిస్తున్న తీరు అక్కడి వారిని తీవ్రంగా కలిచివేసింది.
ఇవి కూడా చదవండి...
ఎస్వీ వర్సిటీ ప్రొఫెసర్ అనుమానాస్పద మృతి
ఘోర ప్రమాదం.. స్పాట్‌లోనే నలుగురు మృతి..
Read Latest Telangana News And Telugu News