BV Pattabhiram: బీవీ పట్టాభిరామ్ కన్నుమూత
ABN , Publish Date - Jul 01 , 2025 | 04:56 PM
ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. పట్టాభిరామ్ వయస్సు 75 సంవత్సరాలు.
హైదరాబాద్, జులై 01: ప్రముఖ ఇంద్రజాలికుడు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు బీవీ పట్టాభిరామ్ కన్నుమూశారు. ఇవాళ (మంగళవారం) ఖైరతాబాద్‌లోని స్వగృహంలో గుండెపోటుతో ఆయన తుదిశ్వాస విడిచారు. ప్రస్తుతం పట్టాభిరామ్ వయస్సు 75 సంవత్సరాలు. బుధవారం ఉదయం 9 గంటలకు స్వగృహం వద్ద అభిమానుల సందర్శనార్థం పట్టాభిరామ్ పార్థీవదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబసభ్యులు వెల్లడించారు. వ్యక్తిత్వ వికాసంపై ఆయన పలు పుస్తకాలు రాశారు. పట్టాభికి భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు.
1949లో బీవీ పట్టాభిరామ్ జన్మించారు. ఆయన స్వస్థలం తూర్పుగోదావరి జిల్లా. తండ్రి పేరు రావ్ సాహెబ్ భావరాజు సత్యనారాయణ. కౌమారదశలో కాలి వైకల్యం కారణంగా.. ఆత్మన్యూనతా భావాన్ని జయించేందుకు ఇంద్రజాలికుడిగా, రచయితగా తనను తాను తీర్చిదిద్దుకున్నారు. కాకినాడలో ఉన్నత విద్యను అభ్యసించారు. ఆ సమయంలో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి వద్ద ఆ విద్యను నేర్చుకున్నారు. ఒకటి రెండు టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించారు.
దాదాపు అర్ధశతాబ్దంపాటు ఇంద్రజాలికుడిగా, సైకాలజిస్టుగా సమాజానికి సేవలందించారు పట్టాభిరామ్. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సైకాలజీ, ఫిలాసఫీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పట్టా సైతం పొందారు. అలాగే ఇదే యూనివర్సిటీ నుంచి యోగా, హిప్నోటిజనంలో పీహెచ్‌డీ చేశారు. భారత ఆహార సంస్థలో ఆయన ఉద్యోగిగా విధులు నిర్వహించారు. పలు పురస్కారాలను సైతం అందుకున్నారు.
స్పందించిన ఏపీ డిప్యూటీ సీఎం..
ప్రముఖ ఇంద్రజాలికులు, హిప్నాటిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు డాక్టర్ బీవీ పట్టాభిరామ్ మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ఆయన కన్నుమూశారని తెలిసి చింతిస్తున్నానన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. ఇంద్రజాల ప్రదర్శనల ద్వారా వినోదాన్ని పంచడమే కాకుండా మూఢ నమ్మకాలు పారద్రోలేలా ఆయన పలు కార్యక్రమాలు నిర్వహించారని ఈ సందర్బంగా ఆయన గుర్తు చేసుకున్నారు. వ్యక్తిత్వ వికాసంతోపాటు మనస్తత్వ శాస్త్రంపై ఆయన పలు రచనలు చేశారని వివరించారు. డా. పట్టాభిరామ్ కుటుంబానికి ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఇవి కూడా చదవండి:
సినీ నటి పాకీజాకు పవన్ కల్యాణ్ ఆర్థిక సాయం
త్రిభాషా విధానంపై వెనక్కి తగ్గిన మహారాష్ట్ర
ఉక్రెయిన్‌పై రష్యా డ్రోన్లు, క్షిపణుల వర్షం..
For More Telangana News and Telugu News