Share News

Factory Explosion: పాశమైలారం ప్రమాదానికి కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు

ABN , Publish Date - Jun 30 , 2025 | 04:49 PM

Factory Explosion: సంగారెడ్డి జిల్లా పాశమైలారం ప్రమాదానికి కారణాలపై అధికారులు క్లారిటీ ఇచ్చారు. రియాక్టర్ పేలడం వల్ల ఈ ప్రమాదం జరగలేదని తేల్చిచెప్పారు.

Factory Explosion: పాశమైలారం ప్రమాదానికి కారణం ఇదే.. తేల్చేసిన అధికారులు
Factory Explosion

సంగారెడ్డి, జూన్ 30: జిల్లాలోని పఠాన్‌చెరు మండలం పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో ప్రమాదానికి అసలు కారణం ఏంటో తేల్చారు అధికారులు. ఈ ప్రమాదం రియాక్టర్ పేలడం వల్ల కాదని.. వేడి గాలి అధిక ఒత్తిడి వల్లే భారీ పేలుడు సంభవించిందని నిర్ధారించారు. పరిశ్రమలో మైక్రో సెల్యులస్ పౌడర్ తయారు చేస్తున్న క్రమంలో బాయిలర్ నుంచి వచ్చే వేడి గాలికి పైప్ లైన్ వ్యవస్థలో ఆటంకాలు ఏర్పడినప్పుడు పేలుడు సంభవించినట్లు తెలిపారు. వేడి గాలి తాకిడికి భవనం కుప్పకూలిందన్నారు. పేలుడు ధాటికి గోడలు బద్దలై పరిశ్రమలోకి వస్తున్న ప్లాంట్ ఇన్‌‌చార్జ్‌పై పడి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. భవన శకలాలు చుట్టుపక్కల పరిశ్రమలోకి దూసుకెళ్లాయన్నారు. పరిశ్రమలో రియాక్టర్లు భద్రంగానే ఉన్నట్లు అధికారులు తేల్చారు.


కాగా.. పాశమైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో దాదాపు 12 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలతో అనేక మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలిసిన వెంటనే ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ.. మదీనాగూడ ప్రణామ్ హాస్పిటల్‌కు చేరుకున్నారు. చికిత్స పొందుతున్న బాధితులను మంత్రి పరామర్శించారు. అలాగే కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు.


ప్రమాదంపై ఫైర్ డీజీ ఏమన్నారంటే..

అలాగే ఈ ప్రమాదంపై ఫైర్ డీజీ నాగిరెడ్డి ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమలో ఉదయం 9:38 గంటలకు బ్లాస్టింగ్ జరిగిందన్నారు. ఈ పరిశ్రమలో మైక్రో క్రిస్టలైజ్ సెల్యులోజ్ అనే మెటీరియల్ తయారు చేస్తారన్నారు. డ్రయింగ్ యూనిట్, ఎయిర్ హ్యాండ్లింగ్ యూనిట్లు పరిశ్రమలో ప్రధానంగా ఉంటాయని తెలిపారు. ఈ రెండు యూనిట్‌లలో ఏదో ఒక చోట సమస్య వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ప్రమాద సమయంలో పరిశ్రమలో ఉన్న కార్మికుల సంఖ్యపై స్పష్టత లేదన్నారు. 35 మంది కార్మికులు క్షతగాత్రులు అయ్యారని.. 12 మంది చనిపోయారని వెల్లడించారు. సమాచరం అందిన నిమిషం లోపే ప్రమాద స్థలికి చేరుకున్నామని.. సాయంత్రం వరకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుందని ఫైర్ డీజీ నాగిరెడ్డి పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి

తెలంగాణలో ప్రమాదంపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల విచారం

కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ ఫైర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jun 30 , 2025 | 05:03 PM