Telangana Industrial Accident: తెలంగాణలో ప్రమాదంపై ప్రధాని మోదీ సహా ప్రముఖుల విచారం
ABN , Publish Date - Jun 30 , 2025 | 03:56 PM
Telangana Industrial Accident: తెలంగాణలోని పాశమైలారంలో జరిగిన ప్రమాదంపై ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
అమరావతి, జూన్ 30: తెలంగాణ రాష్ట్రంలోని (Telangana State) పాశమైలారం పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో పలువురు కార్మికులు దుర్మరణం చెందారు. ఈ విషాద ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan Kalyan), మంత్రి నారా లోకేష్ (Minister Lokesh) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందించారు. రసాయనిక పరిశ్రమలో రియాక్టర్ పేలి కార్మికులు మృతిచెందడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. అలాగే పీఎంఆర్‌ఎఫ్ ఫండ్ నుంచి మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు ప్రధాని మోదీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
ప్రమాదంపై ప్రధాని మోదీ ట్వీట్
‘తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డిలో ఒక కర్మాగారంలో జరిగిన అగ్నిప్రమాదంలో చాలా మంది ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరం. తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాను. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను. మృతుల బంధువులకు పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి రూ.2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50,000 ఎక్స్ గ్రేషియా అందిస్తాము’ అని ప్రధాని మోదీ ప్రకటించారు.
ప్రమాదంపై పవన్ ఆవేదన
తెలంగాణ రాష్ట్రంలోని పాశమైలారం పారిశ్రామికవాడలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఎనిమిది మంది కార్మికులు దుర్మరణం పాలయ్యారని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సిగాచీ రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలడం మూలంగా చోటు చేసుకున్న ఈ పరిశ్రమలో గాయపడ్డవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వారికీ, ఇతర క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను’ అంటూ డిప్యూటీ సీఎం పవన్ ట్వీట్ చేశారు.
దిగ్భ్రాంతికి గురిచేసింది: మంత్రి లోకేష్
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో సిగాచి రసాయన పరిశ్రమలో రియాక్టర్ పేలిన ఘటనలో 8 మంది మృతి చెందిన విషయం దిగ్భ్రాంతి కలిగించింది. ఈ ఘటనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు తీవ్రంగా గాయపడిన వార్త ఆందోళనకు గురిచేసింది. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాను. మృతుల కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను.
ఇవి కూడా చదవండి
కేంద్రమంత్రి అమిత్ షాపై టీపీసీసీ చీఫ్ ఫైర్
అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తా: రామచందర్‌రావు
Read Latest Telangana News And Telugu News