Share News

Cyber Fraud : మరో భారీ సైబర్ మోసం..కోట్లు కాజేసిన ముఠా

ABN , Publish Date - Jan 19 , 2025 | 09:18 AM

Cyber Fraud: మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్‌లైన్ మోసంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు భారీగా మోసపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Cyber Fraud : మరో భారీ సైబర్ మోసం..కోట్లు కాజేసిన ముఠా
Cyber Fraud

జనగామ : పేరు ఏదైనప్పటికీ ఆన్‌లైన్‌ చైన్‌ దందాలన్నీ ఒకేలా పనిచేస్తున్నాయి. మొదట్లో ఆకాశానికెత్తే లాభాలు చూపుతాయి. మెల్లగా చైన్‌ లింక్‌ దందాలో ఇరికిస్తాయి. ‘ఇక నువ్వు కూడా ఓ అయిదుగురికి చేరిస్తేనే నీకు లాభాలు వస్తాయి’. అనే పరిస్థితికి తీసుకువస్తాయి. అధిక లాభాలు వస్తాయన్న అత్యాశతో రూ. లక్షల్లో పెట్టిన పెట్టుబడితో పాటు ఎంతో కొంత లాభాలను పొందాలని ఆ దందాల్లో చాలామంది కూరుకు పోతున్నారు. తాజాగా జనగామ జిల్లాలో బయటపడిన భారీ సైబర్ మోసంతో ఇలా ఇరుక్కుపోయిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇందులోనూ అధికశాతం మధ్య తరగతి కుటుంబాలవారే. గతంలోనూ చాలా ఆన్‌లైన్‌ దందాలు ఎన్నో కుటుంబాలను రోడ్డుపాలు చేశాయి.


తాజాగా భారీ ఆన్‌లైన్‌ మోసం జనగామ జిల్లాలో బయటపడింది. కోస్తా వెల్ గ్రోన్ యాప్‌లో పెట్టుబడి పెడితే రెట్టింపు అవుతాయని నిర్వాహకులు నమ్మించారు. ఏజెంట్ల మాటలు నమ్మి భారీగా పెట్టుబడులు పెట్టాక విత్ డ్రా ఆప్షన్‌ను నిర్వాహకులు తొలగించారు. మోసపోయామని గమనించి పోలీసులను పలువురు బాధితులు ఆశ్రయించారు. ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్ కేంద్రంగా యాప్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. రూ. 20కోట్ల మేర మోసం జరిగినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఇలా జనగామ జిల్లాలో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. భారీ ఆన్‌లైన్ పేరుతో సుమారు రూ. 20 కోట్లను మేర కేటుగాళ్లు వసూలు చేశాడు. పలు యాప్స్‌లో ట్రేడింగ్ చేస్తూ భారీగా సంపాదించుకోవచ్చని కేటుగాళ్లు ఆశ చూపించారు. భాదితులు మోసపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.


అప్పులు చేసి పెట్టుబడులు..

జనగామ జిల్లా కేంద్రంతో పాటు చుట్టు పక్కల గల పలు గ్రామాలు, మండలాల్లో కొన్ని నెలలుగా ఈ దందా జోరుగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. రూ. కోట్లలో లావాదేవీలు జరుగుతున్నట్లు సంబందిత వర్గాలు అంటున్నాయి. పదుల సంఖ్యలో మార్కెట్‌లో చలామణి అవుతున్న పలు యాప్‌లలో పెట్టుబడులు పెట్టి వందల సంఖ్యలో బాధితులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం ఏ నలుగురు కలిసినా జరుగుతున్న చర్చ ఒక్కటే...ఆన్‌లైన్‌ వ్యాపారంలో ‘నేను ఇంత పెట్టాను..నువ్వు ఎంత పెట్టావు’ అని. ఇలా ఆన్‌‌లైన్‌లో పెట్టుబడి పెట్టిన వారు ఎదుటి వారిని ప్రభావితం చేసేందుకు పనిగట్టుకొని ప్రచారం చేస్తున్నారు. క్రిప్టో కరెన్సీకి చెందిన పదుల సంఖ్యలో గల యాప్‌ బ్లాక్‌ చైన్‌ దందాలు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఈ ఆన్‌లైన్‌ మోసపూరిత దందాలో పెట్టుబడులు పెడితే తక్కవ కాలంలో ఎక్కువ లాభాలు గడించవచ్చనే కేటుగాళ్ల మాటలతో నిత్యం ఎంతో మంది సామాన్యులు ఈ దందాల వైపు ఆకర్షితులవుతున్నారు. అప్పులు చేసి దందాలో పెట్టుబడులు పెట్టి మోసానికి గురవుతున్నారు.


వెలుగులోకి భారీ మోసం....

జనగామ జిల్లాలో ఈ భారీ మోసం బయటకు వచ్చిన తర్వాత ఆన్‌లైన్‌ కథలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ దందాలో ఎక్కువగా మధ్యతరగతి కుటుంబాలు, వ్యాపారులు, యువత, ఉపాధ్యాయులు, ఉద్యోగులు, రియల్‌ వ్యాపారులు ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఇలాంటి కుటుంబాలు ఈ దందాలో తమ శక్తికి మించి పెట్టుబడులు పెట్టాయి.


వారిపైనే పూర్తిగా ఫోకస్‌

పలువురు వ్యాపారులు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, అధికారులే నేరుగా ఈ దందాలో ఉండటమే జిల్లాలో వేగంగా విస్తరించడానికి కారణంగా తెలుస్తోంది. గతంలో చాలా ఆన్‌లైన్‌ దందాలు నిర్వాహకులు చేసినట్లే.. ఇందులోనూ సమాజంలో కొంత పేరుండి, వాళ్లు చెబితే పదిమంది వింటారు. అనే వారినే ఎంచుకుంటున్నారు. ప్రధానంగా గ్రామాల్లో పలువురు ఉద్యోగులు, నేతలు, పట్టణ ప్రాంతాల్లో ఉద్యోగులు, అధికారులు, వైద్యులు ఇలా...కొన్ని ప్రభావిత వర్గాలను ఎంచుకుని వారిపైనే పూర్తిగా ఫోకస్‌ పెట్టి మరీ చేర్చుకుంటున్నారు. వారు కూడా అత్యాశకు గురై ఈ దందాలోకి రావడంతో వీరిని నమ్మి మిగిలిన వారంతా చేరుతూ మోసపోతున్నారు.

Updated Date - Jan 19 , 2025 | 09:24 AM