Share News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ దూకుడు

ABN , Publish Date - Dec 20 , 2025 | 12:37 PM

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావును కొత్త సిట్ బృందం విచారిస్తోంది. వారం రోజుల పాటు సిట్ విచారణ కొనసాగనుంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ దూకుడు
Phone Tapping Case

హైదరాబాద్, డిసెంబర్ 20: ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త సిట్ విచారణ చేపట్టింది. ఈ కేసులో కీలక నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో సిట్ అధికారులు విచారిస్తున్నారు. ప్రభాకర్ రావు సీసీఎస్‌కు తీసుకెళ్లిన పోలీసులు తిరిగి జూబ్లీహిల్స్‌కు పీఎస్‌కు తరలించారు. ప్రభాకర్‌రావు కస్టోడియల్ విచారణను సుప్రీం కోర్టు వారం రోజుల పాటు పొడిగించిన విషయం తెలిసిందే. ఇప్పటికే వారం రోజుల విచారణ పూర్తి అవగా.. మరో వారం రోజుల పాటు ప్రభాకర్ రావును విచారించేందుకు సుప్రీం ధర్మాసనం సమయం ఇచ్చింది. ఈ క్రమంలోనే జూబ్లీహిల్స్ పీఎస్‌లో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ విచారణ కొనసాగుతోంది.


కాగా.. రెండు రోజుల క్రితం తొమ్మిది మంది అధికారుల బృందంతో కొత్త సిట్‌ను డీజీపీ శివధర్ రెడ్డి ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ సీపీ సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్ బృందానికి పనిచేయనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ పీఎస్‌కు చేరుకున్న కొత్త సిట్ బృందం ప్రభాకర్ రావును ప్రశ్నిస్తోంది. వారం రోజుల పాటు ప్రభాకర్‌ను సిట్ విచారించనుంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు వెలుగులోని రాని అంశాలను కొత్త సిట్ బృందం బయటకు తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.


ప్రభాకర్ రావును ఈనెల 25 వరకు సిట్ కస్టోడియల్ విచారణ చేయనుంది. గతంలో అరెస్ట్ అయిన నిందితులను పిలిచి ప్రభాకర్ రావు ముందు విచారిస్తోంది. వాళ్లు ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును సిట్ విచారించనుంది. ఫోన్ టాపింగ్ కేసులో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావుతో కలిపి ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ను సిట్ బృందం విచారిస్తోంది.


హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసంతో పాటు మొబైల్, ల్యాప్‌టాప్‌లోని సమాచారాన్ని ప్రభాకర్ డిలీట్ చేసిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగే అవకాశం ఉంది. వారం రోజుల విచారణ అనంతరం ఆ రిపోర్టును సిట్ బృందం సుప్రీంకోర్టుకు సమర్పించనుంది. ఈ వారం రోజుల విచారణలో కీలక పరిణామాలు జరిగే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి...

ఏకంగా ఆస్పత్రిలోనే డ్రగ్స్ వినియోగం.. వ్యక్తి అరెస్ట్

సీఎం రేవంత్‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 20 , 2025 | 12:57 PM