Share News

MLA Raja singh: బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్

ABN , Publish Date - Sep 10 , 2025 | 05:58 PM

తన వెనుక ఎవ్వరు లేరని.. అప్పుడు ఇప్పుడు తాను ఒక్కడినేనని ఎమ్మెల్యే రాజా సింగ్ చెప్పారు. యూపీ సీఎం యోగితోపాటు పలువురు తనకు ఫోన్ చేసి.. ఎందుకు రాజీనామా చేశావని అడిగారన్నారు. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచినా.. పార్టీలో తనకు గుర్తింపు లేదని వారి తెలిపినట్లు చెప్పారు.

MLA Raja singh: బీజేపీ నేతలకు ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్
MLA Raja singh

హైదరాబాద్, సెప్టెంబర్ 10: బీజేపీ నేతలకు గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ సవాల్ విసిరారు. తెలంగాణాలో ఇటీవల బీజేపీ కార్యవర్గం ఏర్పాటు చేసిన కమిటీ ద్వారా రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తీసుకు వస్తే.. తాను రాజకీయ సన్యాసం చేస్తానని ఆ పార్టీ నేతలకు ఎమ్మెలే రాజాసింగ్ సవాల్ విసిరారు. బుధవారం హైదరాబాద్‌లో గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మాట్లాడుతూ.. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు మంచి మనిషి అని.. కానీ ఆయన రబ్బర్ స్టాంప్ అంటూ పెదవి విరిచారు. బీజేపీలోని కొంత మంది వ్యక్తులు.. తనను లక్ష్యంగా చేసుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీజేపీలో తప్పులు జరుగుతున్నాయని.. మరి ముఖ్యంగా కార్యకర్తలకు అన్యాయం జరుగుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్లు వివరించారు.


ఇటీవల పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలో 12 మంది వరకు సికింద్రాబాద్ పరిధిలోని వారికే పదవులు ఇచ్చారన్నారు. మరి జిల్లాలు, గ్రామీణ ప్రాంతంలోని కార్యకర్తల అవసరం మీకు లేదా? అంటూ బీజేపీ రాష్ట్ర నాయకత్వాన్ని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఈ కమిటీని రామచందర్ రావు వేశారా? లేకుంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబితే ఈ కమిటీ వేసారా? అంటూ ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలతో తనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయన్నారు. వాళ్లందరూ ఫోన్ చేసి.. గతంలో మీరు చెప్పిన మాటలు నిజమవుతున్నాయని అంటున్నారన్నారు. పార్టీని నాశనం చేస్తున్నారంటూ తెలంగాణలోని బీజేపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఇటీవల ఏర్పాటు చేసిన కమిటీపై సంతృప్తి ఉందా? అంటే లేదని ఎంపీలంతా చెబుతారన్నారు.


దేశ రాజధాని ఢిల్లీ వెళ్లి.. దేశం గురించి తనకు మాట్లాడే అవకాశం తనకు వచ్చిందంటే.. అదంతా కార్యకర్తల వల్లనేనన్నారు. గతంలో మహిళ తనపై వ్యాఖ్యలు చేసిందని గుర్తు చేశారు. ఒకరిపై కామెంట్ చేసేటప్పుడు.. వాళ్ల గురించి తెలుసుకోవాలని సూచించారు. కమిటీలో నియమించిన అశోక్‌పై అవినీతి ఆరోపణలు ఉన్నాయంటూ.. అందుకు సంబంధించిన పలు అంశాలను ఈ సందర్భంగా ఆయన సోదాహరణగా వివరించారు. గతంలో రాంచందర్ రావు నివాసం వద్ద సైతం అశోక్ అవినీతిపై చర్చ జరిగిందని గుర్తు చేశారు.


అయితే తాను గోషా మహల్ ప్రజల వల్లే మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. నాలుగో సారి సైతం ఎన్నికల బరిలో నిలిచిన.. ప్రజల తనను గెలిపిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఫైటరనని.. రోడ్డు మీద ఉండి కొట్లాడతానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావాలనుకునే వాళ్లలో తాను ఒకడినని తెలిపారు. బీజేపీ అధికారంలోకి వస్తుందంటే.. రాకుండా చేశారంటూ ఆ పార్టీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయ్యనని .. ఏం చేసుకుంటారో చేసుకోండంటూ బీజేపీ రాష్ట్ర నేతలను ఆయన సవాల్ విసిరారు. బీజేపీ కార్యకర్తల గొంతుగా తాను మాట్లాడుతానని.. రాజీనామా చేసిన రోజు కూడా ఇదే విషయం చెప్పానన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తే.. తాను రాజీనామా ఇస్తానని స్పష్టం చేశారు. సికింద్రాబాద్‌లో కానీ.. గోషామహల్‌లో కానీ మళ్ళీ పోటీ చేద్దాం.. ఎవరు గెలుస్తారో చూద్దామంటూ సవాల్ విసిరారు.


తన వెనుక ఎవ్వరు లేరని.. అప్పుడు ఇప్పుడు తాను ఒక్కడినేనన్నారు. యూపీ సీఎం యోగితోపాటు పలువురు తనకు ఫోన్ చేసి.. ఎందుకు రాజీనామా చేశావని అడిగారని.. మూడో సారి ఎమ్మెల్యేగా గెలిచినా.. తనకు గుర్తింపు లేదని అందుకే ఆ బాధతో రాజీనామా చేశానని వారికి వివరించినట్లు చెప్పారు. అసలైన పార్టీ కార్యకర్తలకు పదవులు రావాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. కార్యకర్తలకు తన విన్నపం ఒక్కటేనన్నారు. ఎవ్వరు బాధపడొద్దు.. అందరికీ టైమ్ వస్తుందన్నారు. సమయం వచ్చినప్పుడు కేంద్రంలోని పెద్దలతో మాట్లాడి.. తన బాధనంతా వారికి చెబుతానన్నారు. గతంలోనే కాదు.. నేడు కూడా తనది బీజేపీనే అని స్పష్టం చేశారు. బీజేపీ కోసం ప్రాణం ఇచ్చే వాళ్ళను పక్కన పెడుతున్నారంటూ ఎమ్మెల్యే రాజా సింగ్ ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సూపర్ సిక్స్‌ను సూపర్ హిట్ చేశాం: సీఎం చంద్రబాబు

ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారానికి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే..

For More TG News And Telugu News

Updated Date - Sep 10 , 2025 | 06:58 PM