Ponnam Prabhakar: బిల్లు ఆమోదం కోసం ఢిల్లీకి: మంత్రి పొన్నం
ABN , Publish Date - Jul 28 , 2025 | 09:55 PM
బీసీ రిజర్వేషన్ బిల్లుా ఆమోదం కోసం న్యూఢిల్లీకి తామంతా వెళ్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఉభయ సభల్లోని ప్రతిపక్ష నేతలను సైతం కలిసి వారి మద్దతు కూడా కూడకట్టుకుంటామని చెప్పారు.
హైదరాబాద్, జులై 28: స్థానిక సంస్థల్లో, విద్య, ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్ పెంపు కోసం రూపొందించిన రెండు బిల్లులను అసెంబ్లీ ఆమోదించిందని రవాణ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. ఈ రెండు బిల్లులను మార్చి 22వ తేదీన రాష్ట్ర గవర్నర్ వద్దకు పంపించామని తెలిపారు. ఈ బిల్లును రాష్ట్రపతి వద్దకు గవర్నర్ పంపారన్నారు. ఇది రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉందని చెప్పారు.
అయితే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు డెడ్ లైన్ విధించిందని గుర్తు చేశారు. సోమవారం తెలంగాణ సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన దాదాపు 5 గంటల పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ విలేకర్లతో మాట్లాడుతూ.. 50 శాతం రిజర్వేషన్ ఎత్తేసేలా పంచాయతీ రాజ్ చట్టానికి సవరణ కోరుతూ ఆర్డినెన్సును జూలై 10వ తేదీన గవర్నర్‌కు పంపించామన్నారు.
బీసీ రిజర్వేషన్ పెంపు బిల్లుకు కేంద్రం ఆమోదించేలా ప్రయత్నం చేయాలంటూ తెలంగాణలోని బీజేపీ ఎంపీలకు ఆయన సూచించారు. కడుపులో కత్తులు పెట్టుకుని కొందరు బీసీ బిల్లును అడ్డుకుంటున్నారంటూ బీజేపీ నేతలపై ఆయన పరోక్ష విమర్శలు గుప్పించారు. అలాగే ఈ బిల్లు ఆమోదానికి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని ఈ కేబినెట్‌లో నిర్ణయించామని చెప్పారు. అందుకోసం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఢిల్లీకి వెళతామన్నారు. ఈ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలుపాలని కోరుతున్నామని పేర్కొన్నారు.
ఈ బిల్లు ఆమోదించాలని కోరడానికి ఆగస్ట్ 5, 6, 7 తేదీల్లో తాము ఢిల్లీలోనే ఉంటామని పొన్నం ప్రభాకర్ వివరించారు. అలాగే ఈ పర్యటనలో భాగంగా రాజ్యసభలో ప్రతిపక్షనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేతలను సైతం తాము కలుస్తామన్నారు. అదే విధంగా పార్లమెంట్‌లో సైతం ఈ అంశాన్ని లేవనెత్తాలని ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను కోరనున్నట్లు చెప్పారు.
ఈ బీసీ బిల్లుకు మద్దతు తెలిపే వారంతా ఢిల్లీకి రావాలని ఆయన పిలుపు నిచ్చారు. రాష్ట్రపతి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నాలు ప్రారంభించామని పేర్కొన్నారు. బీసీ బిల్లుకు మద్దతు ఇవ్వాలంటూ బీజేపీ ఎంపీలకు మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. న్యాయపరమైన చిక్కులు రాకుండా కుల గణనను పూర్తి చేశామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
దివ్యా దేశ్‌ముఖ్‌ను అభినందనలతో ముంచెత్తిన నారా ఫ్యామిలీ
Read latest Telangana News And Telugu News