Share News

Banakacherla Project: బనకచర్లపై కేంద్రం కీలక ప్రకటన

ABN , Publish Date - Jul 28 , 2025 | 07:13 PM

సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తరలించి.. సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఆ క్రమంలో గోదావరిపై బనకచర్ల ప్రాజెక్ట్‌ను రూ. 81,900 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది.

Banakacherla Project: బనకచర్లపై కేంద్రం కీలక ప్రకటన
Central Minister CR Patil

న్యూఢిల్లీ, జులై 28: బనకచర్ల ప్రాజక్ట్ పనులు ఇంకా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపట్ట లేదని కేంద్ర జల శక్తి శాఖ సహాయ మంత్రి రాజ్ భూషణ్ చౌదరి వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ సాంకేతిక, ఆర్ధిక అంచనా కోసం ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టును ఇప్పటికే కేంద్ర జలసంఘానికి అందించినట్లు తెలిపారు. ఈ ప్రాజక్ట్‌పై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు లేవనెత్తుతూ... లేఖ రాసిందని గుర్తు చేశారు. ఈ ప్రాజక్ట్ సాంకేతిక - ఆర్థిక అంచనాల కోసం కేంద్రం తగిన ప్రక్రియను అనుసరిస్తోందని ఆయన స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్ట్‌పై సంబంధిత అధికారులు, పరీవాహక ప్రాంత రాష్ట్రాలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. సోమవారం రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ నేత, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా కేంద్ర జల శక్తి మంత్రి రాజ్ భూషణ్ లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు.


సముద్రంలోకి వృథాగా వెళ్లే గోదావరి మిగులు జలాలను రాయలసీమకు తరలించి.. సస్యశ్యామలం చేయాలని చంద్రబాబు సారథ్యంలోని కూటమి ప్రభుత్వం సంకల్పించింది. ఆ క్రమంలో గోదావరిపై బనకచర్ల ప్రాజెక్ట్‌ను రూ. 81,900 కోట్లతో నిర్మించాలని నిర్ణయించింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ క్రమంలో అఖిల పక్షం ఏర్పాటు చేసి.. ఈ ప్రాజెక్ట్‌ నిర్మాణానికి వ్యతిరేకంగా తీర్మానం చేశారు.


అనంతరం సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని పలువురు మంత్రులు ఢిల్లీలోని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను కలిసి.. బనకచర్ల నిర్మాణాన్ని అడ్డుకోవాలని.. ఈ ప్రాజెక్ట్ నిర్మాణం వల్ల తెలంగాణకు భవిష్యత్తులో కలిగే సమస్యలను వివరించింది. దీంతో ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం సమర్పించిన దస్త్రాన్ని కేంద్రం జలశక్తి మంత్రిత్వ శాఖ పక్కన పెట్టింది.


ఆ తర్వాత.. ఇటీవల న్యూఢిల్లీ వేదికగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి సంబంధించిన పలు అంశాలు ఈ సందర్భంగా వీరు చర్చించారు. అనంతరం ఈ అంశంపై నిపుణులతో కూడిన కమిటీ ఏర్పాటు చేయాలంటూ ఈ భేటీలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశానికి ఇరు రాష్ట్రాల భారీ నీటి పారుదల శాఖ మంత్రులతోపాటు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు హాజరయ్యారు.

ఈ వార్తలు కూడా చదవండి..

నాగ పంచమి రోజు.. జస్ట్ ఇలా చేయండి..

‘కాలేజీలు ఖాళీ’ అంటూ ప్రచారం.. మంత్రి లోకేష్ మాస్ వార్నింగ్

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 28 , 2025 | 07:15 PM