KTR On NDSA Report: బీఆర్‌ఎస్ మాటే అక్షర సత్యం.. ఎన్డీఎస్ఏ నివేదికపై కేటీఆర్
ABN , Publish Date - May 28 , 2025 | 01:01 PM
KTR On NDSA Report: మేడిగడ్డ బ్యారేజ్‌పై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటి దాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందన్నారు.
హైదరాబాద్, మే 28: మేడిగడ్డ బ్యారేజీకు సంబంధించి ఎన్డీఎస్ఏ (NDSA Report) ఇచ్చిన నివేదికను మరోసారి తప్పుబట్టారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (BRS Working President KTR). ఆ నివేదిక బూటకమని బీఆర్‌ఎస్ చెబుతున్న మాట వాస్తవమని తేలిందన్నారు. మేడిగడ్డ బ్యారేజి గురించి ఎన్డీఎస్ఏను ఎల్ అండ్ టీ అడిగిన ప్రశ్నతో ఇది తప్పుడు నివేదిక అని తేలిందన్నారు. ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని సీఎం రేవంత్ చెప్పడం దివాలాకోరు విధానాలకు నిదర్శనమంటూ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా కేటీఆర్ విరుచుకుపడ్డారు.
కేటీఆర్ ట్వీట్
మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాటే అక్షరాలా నిజమని తేలిపోయిందన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఎస్ఏ తుది రిపోర్టు ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ అండ్ టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పులతడక అని రుజువైపోయిందని అన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏఎస్ ఇచ్చిన నివేదికను ఎల్ అండ్ టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టు లాంటిదే అని వ్యాఖ్యలు చేశారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకుని, ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకూ రెండింటిలోనూ అడుగడుగునా వ్యత్యాసాలు, పొంతనలేని అంశాలుండటం రిపోర్టు డొల్లతనాన్ని బయటపెట్టిందని మాజీ మంత్రి విమర్శించారు.
ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఎస్ఏ నివేదికనే తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్, రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాలాకోరు విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌కు పేరొస్తుందనే రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరంను పక్కనపెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారన్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండగొట్టి, 500 మందికి పైగా అన్నదాతలు ఆత్మహత్యలకు కారణమయ్యారని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రం వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మరిచిపోయి, మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజీలోకి నెట్టడం అత్యంత దుర్మార్గమన్నారు.
నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్‌పై బురదజల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్ - బీజేపీ, ఇటీవల బీఆర్ఎస్ రజతోత్సవ సభను దెబ్బతీయాలన్న కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట నయా డ్రామాకు తెరతీశారన్నారు. ప్రాజెక్టు ప్రణాళికల నుంచి నిర్మాణ నాణ్యత వరకూ అడుగడుగునా ఎక్కడా రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురదజల్లడం మాని, ఇకనైనా ఎల్ అండ్ టీ అభ్యంతరాలకు ప్రభుత్వం, ఎన్డీఎస్ఏ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఎన్డీఎస్ఏ వాదనలన్నీ తప్పుల తడక అని తేలిపోయిన నేపథ్యంలో దీన్ని కుంటిసాకుగా చూపి దాటవేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర రైతులకు బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు. ఇకనైనా పోలవరం తరహాలో పునరుద్ధరణ చర్యలు చేపట్టి తెలంగాణ రైతుల సాగునీటి కష్టాలను తీర్చాలని... లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ - బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ముందే వచ్చేసిన సజ్జల భార్గవ్ రెడ్డి
ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
Read Latest Telangana New And Telugu News