NTR Jayanti: ఎన్టీఆర్‌కు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు ఘన నివాళి
ABN , Publish Date - May 28 , 2025 | 09:37 AM
NTR Jayanti: నట సార్వభౌమ, స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా నివాళులర్పించారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ప్రధాని, సీఎం స్పందించారు.
అమరావతి, మే 28: విశ్వవిఖ్యాత, నట సార్వభౌమ, టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు, స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) 102వ జయంతి సందర్భంగా రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi), ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) అంజలి ఘటించారు. సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఎన్టీఆర్‌కు నివాళులర్పించారు ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు. నిరుపేదలు, అణగారిన వర్గాలకు సాధికారిత కల్పించేందుకు ఎన్టీఆర్ చేసిన కృషి అద్భుతమని ప్రధాని ప్రశంసించారు.
మోదీ ట్వీట్ ఇదే
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రధాని నివాళులర్పించారు. సమాజానికి సేవ చేయడం, నిరుపేదలు, అణగారిన వర్గాల ప్రజలకు సాధికారిత కల్పించడం కోసం ఆయన చేసిన కృషిని అభినందించారు. ఎన్టీఆర్ నటించిన చిత్రాలు, రచనలు ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకుంటాయని ప్రధాని మోదీ గుర్తు చేశారు. ఎన్టీఆర్ నుంచి మనం ఎంతో ప్రేరణ పొందామన్నారు. మిత్రులు చంద్రబాబు నాయుడు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్డీయే ప్రభుత్వం ఎన్టీఆర్ దార్శనికతను నెరవేర్చేందుకు కృషి చేస్తోందని ప్రధాని ఈ సందర్భంగా విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు.
చిరస్మరణీయుడు ఎన్టీఆర్: చంద్రబాబు
‘యుగపురుషుడు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, తెలుగు వారి ఆరాధ్య దైవం, తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు, సంక్షేమానికి కొత్త బాట చూపిన సంఘ సంస్కర్త, 'అన్న' నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. పేద ప్రజలకు కూడు, గూడు, గుడ్డ అనే మూడు అవసరాలను తీర్చడమే తన జీవితాశయంగా భావించిన ధీరోదాత్తుడు అన్న ఎన్టీఆర్. 'సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు' అనే నినాదంతో ప్రజాస్వామ్యానికి కొత్త అర్ధం చెప్పిన దార్శనికుడు ఆయన. అన్నగా ఆడబిడ్డలకు ఆస్తి హక్కు ఇచ్చినా, మండల వ్యవస్థతో పాలనారంగాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్లినా, పక్కా ఇళ్ల నిర్మాణంతో పేదలకు అండగా నిలిచినా, కిలో రెండు రూపాయలకే బియ్యాన్ని అందించి పేదల ఆకలి తీర్చినా... ఏది చేసినా ఆయన మనసులో ఉన్నది ఒక్కటే... ‘నా తెలుగు జాతి సగౌరవంగా తలెత్తుకు నిలబడాలి’ అనే సంకల్పమే. చరిత్రలో స్థానం సంపాదించుకోవడం కాదు... చరిత్రనే సృష్టించిన చిరస్మరణీయుడు అన్న ఎన్టీఆర్. ఈనాటికీ తెలుగుదేశం ఉజ్వలంగా ప్రకాశిస్తున్నదంటే అది ఆయన ఆశీర్వాదబలమే. ఆ మహనీయుడి సంకల్పాన్ని నెరవేర్చేందుకు అహర్నిశలూ కష్టపడుతూనే ఉన్నాం.. సమసమాజాన్ని సాధించే దిశగా సాగుతున్నాం. అనితరసాధ్యమైన ఎన్నో పనులు చేసిన అన్న నందమూరి తారకరామారావుకు మరొక్కమారు ఘన నివాళి అర్పిస్తున్నాను’ అంటూ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి
ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్
తాగి టేబుల్ మీద డ్యాన్స్ చేయమన్నారు.. శాసనసభ్యురాలికీ లైంగిక వేధింపులు
Read Latest AP News And Telugu News