Share News

Donald Trump: ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్

ABN , Publish Date - May 28 , 2025 | 08:25 AM

అమెరికాలో కెనడా భాగస్వామ్యం కావాలని డొనాల్డ్ ట్రంప్ ఆకాంక్షిస్తున్నారు. అలాంటి వేళ.. కెనడాకు ఆయన కీలక ఆఫర్ చేశారు.

Donald Trump: ఆ దేశానికి యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ ఆఫర్

వాషింగ్టన్, మే 28: సరికొత్త క్షిపణి వ్యవస్థ గోల్డెన్ డోమ్‌కు అమెరికా శ్రీకారం చుట్టనుంది. అందులో చేరేందుకు కెనడా ఆసక్తి కనబరుస్తోంది. ఈ నేపథ్యంలో యూఎస్ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. అమెరికాలో కెనడా భాగం కావాలనుకోవడాన్ని ఆయన స్వాగతించారు. అయితే అమెరికాలో కెనడా అంతర్భాగం కావాలని తాను ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో కెనడా 51వ రాష్ట్రంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. అలా అయితే ఎటువంటి నగదు చెల్లించకుండా.. ఈ సరికొత్త రక్షణ వ్యవస్థను కెనడాకు సైతం అనువర్తింప చేస్తామని ప్రకటించారు. అలా కానీ పక్షంలో 61 బిలియన్ డాలర్లను అమెరికాకు చెల్లించాల్సి ఉంటుందని డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్.. ట్రూత్ సోషల్ మీడియా వేదికగా మంగళవారం వెల్లడించారు. అయితే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రతిపాదనపై కెనడా ఇప్పటి వరకు స్పందించ లేదు.


అమెరికాపై ఎటువైపు నుంచి దాడులు జరగకుండా ఉండేందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ గత వారం కీలక నిర్ణయం తీసుకున్నారు. అందుకోసం సరికొత్త క్షిపణి వ్యవస్థ గోల్డెన్ డోమ్‌‌‌ను చేపట్టారు. ఈ క్షిపణి వ్యవస్థ తయారీకి 175 బిలియన్ డాలర్ల వ్యయం కానుంది. ఈ క్షిపణి వ్యవస్థ తయారీకి దాదాపు మూడేళ్లు పడుతుంది. అంటే ట్రంప్ అధ్యక్ష స్థానం నుంచి దిగిపోయే సమయానికి ఈ క్షిపణి వ్యవస్థ సిద్ధం కానుంది.


కెనడా, అమెరికాలు ఇప్పటికే నాటో సభ్య దేశాలుగా ఉన్నాయి. అలాగే నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ ద్వారా ఖండాంతర రక్షణలో సైతం ఈ రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి. మరోవైపు మే మొదటి వారంలో కెనడా ప్రధాని మార్క్ కార్నీ అమెరికాలో పర్యటించారు. ఈ సందర్భంగా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో ఆయన భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమెరికాలో కెనడా భాగం కావాలంటూ ట్రంప్ పిలుపు నిచ్చారు. దీనిని కెనడా ప్రధాని తోసిపుచ్చిన సంగతి తెలిసిందే. కెనడా ఎప్పటికీ అమ్మకానికి సిద్ధంగా ఉండదంటూ ట్రంప్‌కు మార్క్ కార్నీ స్పష్టం చేసిన విషయం విదితమే. అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాలు ఉన్నాయి. 51 రాష్ట్రంగా కెనడా ఉండాలని ట్రంప్ బలంగా కోరుకుంటున్నారు. ఆ క్రమంలో ట్రంప్ ఈ ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి

ఉక్రెయిన్‌ దీర్ఘశ్రేణి ఆయుధాలు వాడటానికి ఓకే

అది నిరూపించు రాజీనామా చేస్తా.. జగన్‌కు లోకేష్ సవాల్

Read Latest International News And Telugu News

Updated Date - May 28 , 2025 | 09:15 AM