Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించిన సీఎం రేవంత్: కేటీఆర్
ABN , Publish Date - Nov 07 , 2025 | 10:17 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు తన ప్రభుత్వ పాలనకు రిఫరెండం కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. ఈ ఉప ఎన్నికల్లో ఓటమిని ఆయన ఒప్పుకున్నారన్నారు.
హైదరాబాద్, నవంబర్ 07: దమ్ముంటే తన 24 నెలల పరిపాలన చూపించి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజల తీర్పు కోరాలని సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాను చేసింది ఏమీ లేకపోవడంతోనే ఆ అటెన్షన్ డైవర్షన్ ప్రయత్నాలకు సీఎం రేవంత్ పాల్పడుతున్నారని విమర్శించారు. పోలింగ్ కంటే ముందే రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఓటమిని అంగీకరించారన్నారు. అందుకే ఈ ఉప ఎన్నిక తన ప్రభుత్వ పాలనకు రెఫరెండం కాదన్నారని రేవంత్ వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా విశ్లేషించారు.
రేవంత్ రెడ్డి తన పరిపాలనపై నమ్మకం లేకనే ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఈ రెఫరెండం కాదన్నారన్నారు. సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం చేసిన వ్యాఖ్యలతో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి ఖాయమైందన్న మాట స్పష్టమైందన్నారు. శుక్రవారం ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంగళరావు నగర్‌లో కేటీఆర్ రోడ్డు షో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ గట్టిగా కౌంటర్ ఇచ్చారు.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత 24 నెలల కాలంలో చేసింది ఏమీ చెప్పుకోవడానికి లేకపోవడంతోనే పాత కాలం కథలు చెబుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన 24 నెలల పాలన కాలంలో చేసిన అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాల అమలు చూపించి ఓట్లు అడగాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్లలో అన్ని రంగాల్లో ప్రజలకు కష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్బండ వర్గాలను ఆరు గ్యారెంటీల పేరుతో మోసం చేశారని చెప్పారు.
రెండేళ్ల పరిపాలనలో విద్యార్థులు, యువకులు, రైతన్నలు, పారిశ్రామికవేత్తలకు చేసిన మోసాన్ని చూసినందుకు రేవంత్ రెడ్డికి కాంగ్రెస్‌కు ఓటు వేయాలా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో హైదరాబాదు నగరాన్ని అధఃపాతాళానికి తీసుకువెళ్లినందుకు నగర ప్రజలు కాంగ్రెస్‌కు ఓటు వేయాలా? అని కేటీఆర్ వ్యంగ్యంగా ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో గెలిస్తే అభివృద్ధి చేస్తామంటూ కాంగ్రెస్ చెబుతున్న అబద్ధాలపై ఈ సందర్భంగా కేటీఆర్ మండి పడ్డారు. గతంలో ఇవే మాటలు చెప్పి కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్క రూపాయి అభివృద్ధి పని కూడా జరగలేదని ఈ సందర్భంగా కేటీఆర్ గుర్తు చేశారు.
10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ఓటు వేయాలని తాము అడిగితే సీఎం రేవంత్ రెడ్డి తనకు సంబంధం లేని గత ప్రభుత్వపు కాంగ్రెస్ పరిపాలన చూసి ఓటు వేయాలని అడగడంపై కేటీఆర్ ఎద్దేవా చేశారు. గత పదేళ్లలో ఐటీ పరిశ్రమ మొదలుకొని టిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రుల నిర్మాణం, ప్రజారోగ్యం, రోడ్లు, ఫ్లై ఓవర్లు, లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, 47 ఫ్లై ఓవర్లతోపాటు తెలంగాణ రాష్ట్రాన్ని మరి ముఖ్యంగా హైదరాబాద్ నగరాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశంలోనే అగ్రస్థానంలో బీఆర్ఎస్ నిలిపిందన్నారు. గత బీఆర్ఎస్ సర్కారు.. హైదరాబాద్ నగరాన్ని అగ్రస్థానంలో నిలిపిందని పేర్కొన్నారు.
కానీ రేవంత్ రెడ్డి గత రెండేళ్లలో హైదరాబాద్ నగరాన్ని పూర్తిగా పతనావస్థకు చేర్చారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రియల్ ఎస్టేట్ మొదలుకొని ఆటో డ్రైవర్ల వరకు అందరి ఉపాధి అవకాశాలపై సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకొట్టి తద్వారా అనేక వర్గాలు ఆత్మహత్యలకు పాల్పడేలా చేశారన్నారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి అరాచకం చేశారంటూ నిప్పులు చెరిగారు.
వేలాది మంది పేదల ఇళ్లు కూలగొట్టిన రేవంత్ రెడ్డి పెద్దవాళ్ళ అక్రమాల జోలికి వెళ్లడం లేదని కేటీఆర్ విమర్శించారు. కేవలం పేదలను లక్ష్యంగా చేసుకుని.. వారి ఇళ్లను హైడ్రా కూలగొడుతుందన్నారు. ఈ హైడ్రా బుల్డోజర్ బస్తీల్లోని పేదల జోలికి రాకూడదంటే.. నవంబర్ 11న జరిగే ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలంటూ ప్రజలకు ఆయన సూచించారు. మంత్రులు అక్రమంగా నిర్మించుకున్న ఫామ్ హౌస్‌లు, ఇళ్లను కేటీఆర్ తన రోడ్డు షోలో అందరికీ అర్థమయ్యేలా ఎల్ఈడి స్క్రీన్‌లపై ప్రదర్శించారు.
హైడ్రా గురించి సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. దమ్ముంటే.. సిగ్గుంటే.. తన మంత్రులు అడ్డగోలుగా అక్రమంగా నిర్మిస్తున్న ఈ నిర్మాణాలను తొలగించాలంటూ సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాలు చేశారు. హైడ్రా వలన ఒక్కరికి కూడా లాభం జరగ లేదని కుండబద్దలు కొట్టారు. రేవంత్ రెడ్డి నిజాయితీ లేని మాటలు మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. నేతి బీరకాయలో నెయ్యి అంతా నిజాయితీ సీఎం రేవంత్ రెడ్డి మాటల్లో ఉంటుందని ఎద్దేవా చేశారు.
జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చే తీర్పుతో తెలంగాణ ప్రజలందరికీ హామీలు అమలు కావాలని.. ఆ దిశగా కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఈ సందర్భంగా ఓటర్లకు కేటీఆర్ పిలుపునిచ్చారు. రెండేళ్లపాటు రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను పీల్చుకుతింటున్న అరాచకానికి అక్రమాలకు కేరాఫ్ అడ్రస్‌గా కనిపించిన కాంగ్రెస్ పార్టీని తరమవలసిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు ఎత్తే నైతిక అర్హత లేదన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా భారీ మెజారిటీతో గెలిచిన ఎన్టీ రామారావుని పదవి నుంచి తొలగించిన దుర్మార్గపు చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని కేటీఆర్ తెలిపారు. శంషాబాద్ విమానాశ్రయానికి పెట్టిన ఎన్టీఆర్ పేరును తొలగించి కాంగ్రెస్ పార్టీ రాజీవ్ గాంధీ పేరు పెట్టిందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా స్వర్గీయ ఎన్టీ రామారావుపై గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తన జీవితమంతా వ్యతిరేకంగా పోరాడిన కాంగ్రెస్ పార్టీ గనుక ఎన్టీ రామారావు విగ్రహాలు పెడితే ఆయన ఆత్మ ఘోషిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
For More TG News And Telugu News