Vijayawada Kanaka Durga Temple: భవానీ దీక్షల విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు: దుర్గ గుడి చైర్మన్
ABN , Publish Date - Nov 07 , 2025 | 07:47 PM
తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ వివరించారు. మొత్తం 24 అంశాలకుగాను 18 ఆమోదించామని చెప్పారు.
విజయవాడ, నవంబర్ 07: భవానీ దీక్ష విరమణకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వారి దేవస్థానం పాలక మండలి చైర్మన్ బొర్రా రాధా కృష్ణ వెల్లడించారు. డిసెంబర్ 11 నుంచి 15వ తేదీ వరకు ఈ భవానీ దీక్ష విరమణ ఇంద్రకీలాద్రిపై చేపడుతున్నట్లు వివరించారు. శుక్రవారం ఇంద్రకీలాద్రి దిగువన దుర్గ గుడి పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం దుర్గగుడి ఈవో శీనా నాయక్‌తో కలిసి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ విలేకర్లతో మాట్లాడారు.
ఇంద్రకీలాద్రి కొండపై ఎటువంటి దుకాణాలు ఉండకూడదని నిర్ణయించామని తెలిపారు. కొండపై అమ్మవారి ఆలయం సమీపంలో దుకాణదారులు అత్యధిక ధరలు వసూలు చేస్తున్నట్లు తమకు ఫిర్యాదులు అందాయన్నారు. ఈ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. అయితే దేవస్ధానమే రెండు దుకాణాలు ఏర్పాటు చేసి.. అసలు ధరకు విక్రయించాలని ఈ పాలక మండలి సమావేశంలో నిర్ణయించామన్నారు.
తొలి పాలక మండలి సమావేశంలో భక్తులకు పెద్దపీట వేసేలా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. మొత్తం 24 అంశాలకుగాను 18 అంశాలను ఆమోదించామని చెప్పారు. దుర్గ గుడికి ఆదాయం పెంచే మార్గాలను అన్వేషిస్తున్నామన్నారు. కొండపై రాజకీయాలు మాట్లాడకూడదనే ఆంక్షలు ఉన్నాయని ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొండపై రాజకీయాలు మాట్లాడొద్దంటూ ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల నేతలకు ఈవో శీనా నాయక్‌తో కలిసి ఈవో బొర్రా రాధాకృష్ణ విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఎయిర్‌పోర్ట్‌లో చిక్కుకుపోయిన వేలాది మంది ప్రయాణికులు..
పురుషుల్లో టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగాలంటే..
For More TG News And Telugu News