Khanapur Road Accidents: ఇప్పటివరకు 200 మంది మృతి, 600 మందికి గాయాలు.. ఎందుకిలా?
ABN , Publish Date - Nov 03 , 2025 | 10:24 AM
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఇవాళ జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఈ రహదారి మీద 200 మంది మృతి చెందారు, 600 మంది గాయాలపాలయ్యారు. అసలు ఆ రోడ్డు మీద ఎందుకిలా జనం..
ఇంటర్నెట్ డెస్క్: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఖానాపూర్ గేటు వద్ద ఇవాళ (సోమవారం) జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం కొత్తేమీ కాదు. ఇప్పటివరకు ఈ రహదారి మీద 200 మంది మృతి చెందారు, 600 మంది గాయాలపాలయ్యారు. అసలు ఆ రోడ్డు మీద ఎందుకిలా జనం అసువులుబాస్తున్నారనే ప్రశ్న ఇప్పుడు స్థానికులను కలచివేస్తోంది.
NH 163 అప్పా జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు రోడ్డు నిర్మాణం ప్రతిపాదన ఉంది. అయితే, ఈ రహదారికి ఇరువైపులా చెట్లు ఎక్కువగా ఉండటంతో గ్రీన్ ట్రైబ్యునల్ అనుమతుల జాప్యంతో నిర్మాణాలకు బ్రేక్ పడుతోంది. హైదరాబాద్-బీజాపూర్ NH-163 (చేవెళ్ల-వికారాబాద్-తాండూరు రోడ్డు)లో గత ఐదేళ్లలో మేజర్ యాక్సిడెంట్స్ అయ్యాయి. ఇరుకైన రోడ్లు, షార్ప్ బెండ్స్, ఓవర్‌లోడ్ టిప్పర్లు, రాంగ్-సైడ్ డ్రైవింగ్ కారణంగా ప్రతి నెలా ఒకటి రెండు ఘోరాలు జరుగుతూనే ఉంటున్నాయి.
నేటి ప్రమాదానికి రాంగ్ సైడ్ డ్రైవింగ్, అతివేగం కారణమైతే, గతేడాది డిసెంబర్ 2వ తేదీన ఆలూరు గేట్ దగ్గర వేగంగా వస్తున్న లారీ కూరగాయల వ్యాపారులపైకి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో నలుగురు అక్కడికక్కడే చనిపోగా, పది మంది తీవ్ర గాయాలపాలయ్యారు.
ఈ ఘటనకు ఒక రోజు ముందు మీర్జాగూడ గేట్ దగ్గర కారు.. బైక్‌ను ఢీకొట్టడంతో దంపతులు మృతి చెందారు. ఈ ఏడాది ఆగస్టు 26న చేవెళ్ల బస్టాండ్ దగ్గర, సిమెంట్ లారీ, బైక్‌ను ఢీకొట్టి తండ్రి-కూతురు మృతి చెందారు. పరిగి-రంగాపూర్ రహదారిలో పెళ్లి బస్సు ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో నలుగురు చనిపోగా, 20మంది గాయాలపాలయ్యారు. ఇలా 2018 నుంచి జరిగిన వివిధ ప్రమాదాల్లో ఇప్పటి వరకూ 200 మందికి పైగా చనిపోయారు. ఆరు వందల మందికి పైగా తీవ్ర గాయాలపాలై దివ్యాంగులుగా మారారు.
ఈ సింగిల్ లేన్ రోడ్డును 4 లేన్ రహదారిగా చేయండని 2021లో ఎంపీ రంజిత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఇప్పటి రేవంత్ సర్కారు ఆ దిశగా చర్యలు చేపట్టినా రాజకీయ నేతల కుతంత్రాలతో రోడ్డు పనులకు ఎక్కడికక్కడ అడ్డంకులు ఎదురవుతూనే ఉండటంతో దీనికి మోక్షం లభించడం లేదన్నది స్థానికుల మాట.
ఇవి కూడా చదవండి..
Infectious Diseases: భారత్‌లో పెరుగుతున్న అంటువ్యాధులు