Share News

KCR Deeksha Day: కేసీఆర్ దీక్షపై సోయి లేకుండా మాట్లాడుతున్నారు: తలసాని

ABN , Publish Date - Nov 28 , 2025 | 06:29 PM

2009 నవంబర్ 29వ తేదీన నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ అన్నారు. ఈ దీక్షపై పలువురు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

KCR Deeksha Day: కేసీఆర్ దీక్షపై సోయి లేకుండా మాట్లాడుతున్నారు: తలసాని

హైదరాబాద్, నవంబర్ 28: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ మీద అవాకులు చవాకులు పేలినంత మాత్రాన ఆయన చరిత్ర మారదని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పష్టం చేశారు. 2009 నవంబర్ 29వ తేదీన నాటి టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర అని ఆయన అభివర్ణించారు. ఈ దీక్షపై పలువురు సోయి లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కొత్త బిచ్చగాళ్లు పొద్దు ఎరగరు అన్నట్లుగా కొంత మంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. ప్రత్యేక రాష్ట్రం రాకుంటే.. కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది?.. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడి దంటూ ఈ సందర్భంగా ఆ పార్టీ నేతలను తలసాని శ్రీనివాసయాదవ్ సూటిగా ప్రశ్నించారు.


శుక్రవారం తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విలేకర్లతో మాట్లాడుతూ.. బతుకమ్మ పేరుతో ఆనాడు తమ ప్రభుత్వం చీరలు పంచితే.. ప్రస్తుతం ఇందిరమ్మ చీరలంటూ పేరు మార్చారని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలపై ఆయన నిప్పులు చెరిగారు. ఈ చీరలు పంపిణీకి కేసీఆర్ తన పేరు పెట్టుకోలేదని గుర్తు చేశారు. శనివారం తెలంగాణ భవన్‌లో కేసీఆర్ దీక్షా దివాస్‌ను ఘనంగా నిర్వహిస్తామని మాజీ మంత్రి తలసారి స్పష్టం చేశారు. రాష్ట్ర చరిత్ర తెలియని వాళ్ళు మాట్లాడుతున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు.. తెలంగాణ ఏర్పాటు చేసే సమయంలో ఎక్కడున్నారంటూ? ప్రశ్నించారు. కేసీఆర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించకుంటే.. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళకి పదవి ఎక్కడిదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఈ సందర్భంగా ఆయన బల్ల గుద్ది ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చారని నిండు అసెంబ్లీలోనే కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ వాళ్ళ లాగా మూర్ఖుల్లా తాము మాట్లాడమని తలసాని శ్రీనివాసయాదవ్ స్పష్టం చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ ల్యాండ్ పూలింగ్‌కు రంగం సిద్ధం

కాంగ్రెస్‌కి కర్రు కాల్చి వాత పెట్టేందుకు సిద్ధంగా ఉన్న బీసీలు: ఎంపీ ఈటల

For More TG News And Telugu News

Updated Date - Nov 28 , 2025 | 06:37 PM