Jupalli Krishna Rao: కేసీఆర్‌ది అంతా నటనే: మంత్రి జూపల్లి కృష్ణారావు
ABN , Publish Date - Dec 22 , 2025 | 01:29 PM
నీళ్ల విషయంలో కేసీఆర్ అనేక తప్పిదాలు చేశారని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను వాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 22: బీఆర్ఎస్ బలహీనమైందని కేసీఆర్‌కు అర్ధమైందని.. పార్టీని కాపాడుకోవడానికే మాజీ సీఎం బయటకు వచ్చారని మంత్రి జూపల్లి కృష్ణారావు వ్యాఖ్యలు చేశారు. సోమవారం నాడు మాట్లాడుతూ... కొడుకు, అల్లుడు వల్ల పార్టీ దిగజారుతోందని కేసీఆర్ భావించారని తెలిపారు. పాలమూరు ప్రాజెక్టులను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదనేది అబద్ధమన్నారు. కేసీఆర్ ముందు చేసే పని వెనక, వెనక చేసే పని ముందు చేశారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఇరిగేషన్ కోసం కాదు తాగునీటి కోసమే అని.. సుప్రీం కోర్టులో కేసీఆర్ ప్రభుత్వం చెప్పిందని గుర్తుచేశారు.
కేసీఆర్ నీళ్ల విషయంలో అనేక తప్పిదాలు చేశారని మండిపడ్డారు. తెలంగాణ నీటి హక్కులను వాడుకోవడంలో కేసీఆర్ విఫలమయ్యారన్నారు. బీజేపీ ప్రతి అడుగులో బీఆర్ఎస్ తోడుగా ఉందని ఆరోపించారు. జగన్ దగ్గరకు వెళ్ళి రాయలసీమను రతనాల సీమగా చేస్తానని కేసీఆర్ అన్నారని.. నీటి హక్కులను సాధించకపోవడంలో వైఫల్యం కేసీఆర్ దే అని వ్యాఖ్యలు చేశారు. పాలమూరు ప్రాజెక్టులపై ప్రేమ ఉన్నట్టు కేసీఆర్ నటిస్తున్నారని మంత్రి విమర్శలు గుప్పించారు.
యూరియాపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి స్పందిస్తూ.. యూరియా కొరతకు కేంద్రమే కారణమన్నారు. సప్లయ్ లేనప్పుడు డిమాండ్ ఎక్కువ అవుతుందని తెలిపారు. ఉన్న యూరియాను సక్రమంగా ఇవ్వాలనుకోవడం తమ తప్పా అని ప్రశ్నించారు. రైతులు లైన్లో ఉండడం చూడలేకనే ప్రత్యామ్నాయ వ్యవస్థ తెస్తున్నామన్నారు. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదని మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి...
ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
బుక్‌ఫెయిర్ సొసైటీ అక్రమాలు వెలుగులోకి.. నిజమెంత?
Read Latest Telangana News And Telugu News