Jubilee Hills ByElections: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి ఫిక్స్..
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:32 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యుర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 19: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సమయం ఆసన్నమవుతుండటంతో ప్రధాన పార్టీలు తమ అభ్యుర్థుల ఎంపిక విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్నాయి. తాజాగా బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తమ పార్టీ నుంచి మాగంటి సునీత పోటీ చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యతను ప్రతి ఒక్క బీఆర్ఎస్ కార్యకర్త తీసుకోవాలని కేటీఆర్ పిలుపునిచ్చారు దివంగత మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగించడానికి సునీత ముందుకొచ్చారని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఓటర్లు కూడా సునీతను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం నాడు జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎర్రగడ్డ డివిజన్ క్యాడర్‌తో కేటీఆర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన కేటీఆర్.. కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ రేవంత్ రెడ్డి సర్కార్ అని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. వక్ఫ్ సవరణలను దేశంలోనే తొలిసారిగా రేవంత్ ప్రభుత్వం అమలుచేసిందన్నారు. చరిత్రలో తొలిసారి ముస్లిం మంత్రి, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ లేకుండానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారన్నారు. రాష్ట్రమంతా ఒక తీరుగా ప్రజలు తీర్పునిస్తే హైదరాబాద్‌లో మాత్రం బీఆర్ఎస్‌ను ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని చెప్పారు. ప్రత్యర్థులు ఎంత దుష్ప్రచారం చేసినా జూబ్లీహిల్స్‌లో మూడోసారి మాగంటి గోపీనాథ్‌ను గెలిపించారన్నారు. మాగంటి గోపీనాథ్ సేవల్ని కొనసాగిస్తామని ఆయన సతీమణి సునీత మీ ముందుకు వచ్చిందని.. అందరూ ఆమెను ఆశీర్వదించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
కేటీఆర్ కామెంట్స్..
‘చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తామన్నారు. స్కూటీలు లేవు కానీ కాంగ్రెస్ నేతల లూటీ మాత్రం ఆగడం లేదు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇండ్లు కూలగొట్టడమే. హైదరాబాద్‌లోని బస్తీ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ తమ ఇంటిని కూలగొడుతుందో అని భయంతో బతుకుతున్నారు. కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు ఏ రోజూ పేదోడి ఇంటిని కూలగొట్టలేదు. హైదరాబాద్‌లో ప్రభుత్వ స్థలాల్లో ఉన్న లక్ష మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చాం. లక్ష మందికి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇచ్చాం. పక్క బస్తీలోకి వచ్చిన బుల్డోజర్ కచ్చితంగా రేపు మీ ఇంటి ముందు కూడా వస్తుంది. ముఖ్యమంత్రి అన్న తిరుపతి రెడ్డి దుర్గం చెరువుల ఇల్లు కడితే హైడ్రా బుల్డోజర్ పోదు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డి కుంటలో ఉన్నది. కాంగ్రెస్‌కు పొరపాటున ఓటేస్తే మీ వేలుతో మీ కంటినే పోడుచుకున్నట్టే. వంద రోజుల్లో అన్ని హామీలను అమలు చేస్తామని కాంగ్రెస్ దారుణంగా తెలంగాణ ప్రజలను మోసం చేసింది. కేసులకు భయపడితే లీడర్లు కాలేరు న్యాయం కోసం ధర్మం కోసం కొట్లాడాలి. మాగంటి గోపీనాథ్ సతీమణి సునీతను గెలిపించుకునే బాధ్యత బీఆర్ఎస్ కార్యకర్తలు అందరి మీద ఉంది. అమీర్ అలీ, అజారుద్దీన్‌లకు టికెట్లు ఇవ్వకుండా కాంగ్రెస్ మోసం చేసింది. మోడీ దగ్గర స్కూల్‌కు, చంద్రబాబు దగ్గర కాలేజీకి వెళ్లి, రాహుల్ గాంధీ దగ్గర ఉద్యోగం చేస్తున్నానని అని రేవంత్ చెప్పుకుంటున్నాడు. కేసీఆర్ దగ్గర హైస్కూల్ చదువుతుంటే ఫెయిల్ అయిండని పార్టీ నుంచి వెళ్లగొట్టారు.’ అంటూ కేటీఆర్ అన్నారు.
Also Read:
Bengaluru News: టీటీడీ బెంగళూరు కమిటీ చైర్మన్‌గా కనకమేడల వీరా
Kadiyam Srihari Responds to speaker Notices: స్పీకర్ నోటీసులు.. ఎమ్మెల్యే కడియం రియాక్షన్
For More Telangana News and Telugu News..