Kadiyam Srihari Responds to speaker Notices: స్పీకర్ నోటీసులు.. ఎమ్మెల్యే కడియం రియాక్షన్
ABN , Publish Date - Sep 19 , 2025 | 01:39 PM
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు.
వరంగల్, సెప్టెంబర్ 19: ఎమ్మెల్యేగా గెలిపిస్తే.. అభివృద్ధి చేస్తానని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలకు తాను మాట ఇచ్చానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెల్లడించారు. తనను ప్రజలు నమ్మి ఎమ్మెల్యేగా గెలిపించారని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమితో ఈ నియోజకవర్గానికి అన్యాయం జరుగుతుందని తాను భావించానని తెలిపారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో కలిసి పని చేస్తేనే నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని అనుకున్నానని చెప్పారు.
దాంతో ఏడాదిన్నరగా కాంగ్రెస్ పార్టీతో కలిసి తాను పని చేస్తున్నానని ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పష్టం చేశారు. దేవాదుల కాల్వలు బాగు చేయాలని సీఎం రేవంత్‌ను కోరానన్నారు. అలాగే స్టేషన్ ఘన్‌పూర్ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి అండగా ఉన్నారని పేర్కొన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి నిధులు సైతం అందించారని చెప్పారు.
పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వరంగల్‌లో పైవిధంగా స్పందించారు.
పోస్ట్ కార్డుల ఉద్యమం..
ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి.. కాంగ్రెస్ పార్టీలో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ నియోజకవర్గం వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఆ క్రమంలో నియోజకవర్గంలోని ఓటర్లు.. కడియం శ్రీహరి రాజీనామా చేయాలంటూ పోస్టు కార్డుల ద్వారా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తున్నారు. మరోవైపు.. నియోజకవర్గంలో ఎక్కడా యూరియా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో రాజీనామా చేయాలంటూ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని రైతులు సైతం డిమాండ్ చేస్తున్నారు.