Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సమీక్ష.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - Sep 14 , 2025 | 09:27 PM
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 14: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ఫలితం.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికలపై ప్రభావం చూపిస్తుందని కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతీ ఒక్కరూ పని చేయాలంటూ వారికి దిశానిర్దేశం చేశారు. ఆదివారం నాడు హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై పార్టీలోని అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలతోపాటు మనం చేసిన అభివృద్ధి పనులను క్షేత్రస్థాయిలో తీసుకెళ్లి ప్రచారం చేయాలని సూచించారు.
పోలింగ్ బూత్‌ల వారీగా ప్రచార ప్రణాళికలను సిద్ధం చేసుకోవాలని వారికి వివరించారు. నియోజకవర్గంలో సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందనే భరోసా ప్రజల్లో కల్పించాల్సి ఉందన్నారు. అలాగే జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందనే నమ్మకాన్ని సైతం ప్రజల్లో కల్పించాల్సిన ఆవశ్యకతను వారికి సీఎం రేవంత్ వివరించారు.
అయితే జూబ్లీహిల్స్ నుంచి అధికార కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో దిగే అభ్యర్థి ఎవరినే విషయాన్ని ఏఐసీసీ చూసుకుంటుందన్నారు. అందుకు సంబంధించిన ప్రక్రియను ఇప్పటికే అగ్రనాయకత్వం ప్రారంభించిందని స్పష్టం చేశారు. ఇక పార్టీ విజయం కోసం పని చేయాల్సిన గురుతర బాధ్యత మీపై ఉందని వారికి సూచించారు. మీ పని తీరు, క్షేత్రస్థాయి పరిస్థితులపై ఎప్పటికప్పుడు తాను సమాచారం తీసుకుంటానని వారితో సీఎం రేవంత్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పని చేయాలని మంత్రులతోపాటు పార్టీలోని సీనియర్లకు సూచించారు.
ఇక ఈ ఉపఎన్నిక గెలుపు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉందని ఇప్పటికే పలు సర్వేలు స్పష్టం చేశాయని వారికి వివరించారు. గత సర్వేల కంటే కూడా ప్రస్తుతం మనం చాలా మెరుగయ్యామన్నారు. మరోవైపు సానుభూతి ఎజెండాగానే ఈ ఉపఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారానికి వెళ్తుందన్నారు. కానీ మనం మాత్రం అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా ఎన్నికల ప్రచారం చేయాల్సి ఉందంటూ వారికి స్పష్టం చేశారు.
అంతేకాకుండా.. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి డొల్ల అని ప్రజలకు సోదాహరణతో వివరించాలంటూ పార్టీ నేతలకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. అలాగే గ్రేటర్ పరిధిలో మనకున్న విజన్ ప్రజలకు వివరించాలన్నారు. పార్టీ నిర్మాణమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని వారికి స్పష్టం చేశారు. గ్రేటర్ పరిధిలో పుంజుకోవడానికి ఈ ఎన్నికలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉందన్నారు. ఇక అభ్యర్థి ఎంపిక బాధ్యతను పూర్తిగా జాతీయ నాయకత్వం చూసుకుంటుందంటూ సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా చేస్తే అంతే అంటూ.. నగర జీవికి వార్నింగ్
హనీ ట్రాప్‌లో చిక్కుకున్న యోగా గురువు.. పోలీసుల ఎదుట లబోదిబో..
For More TG News And Telugu news