Hyderabad Chit Fund Scam: చిట్టీల పేరుతో రూ.12 కోట్ల ఘరానా మోసం
ABN , Publish Date - Oct 29 , 2025 | 10:01 AM
కొన్ని రోజుల తరువాత అలీ, రేష్మా చెప్పపెట్టకుండా ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపారు.
హైదరాబాద్: సైబరాబాద్‌లో చిట్టీల పేరుతో ఓ దంపతులు ఘరానా మోసానికి పాల్పడ్డారు. సాఫ్ట్‌వేర్ ఎంప్లాయిస్, గృహిణులు ఇతర వ్యక్తుల నుంచి సుమారు రూ.12 కోట్ల వరకు దంపతులు మహమ్మద్ అలీ, రేష్మా వసూలు చేసినట్లు సమాచారం. దంపతులు 2016 నుంచి నగరంలో చిట్టీలను నడుపుతున్నట్లు బాధితులు తెలిపారు. కొద్ది రోజుల క్రితం చిట్టిలను ఆపేస్తున్నట్టు తెలిపారని పేర్కొన్నారు. చిట్టీలను ఆపడంతో.. తమ డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు చెప్పారు. తమ ఇల్లు అమ్మి డబ్బు ఇస్తామని అలీ, రేష్మా చెప్పారని బాధితులు వివరించారు.
అనంతరం కొన్ని రోజుల తరువాత అలీ, రేష్మా చెప్పపెట్టకుండా ఇంటికి తాళం వేసి పారిపోయినట్లు బాధితులు పేర్కొన్నారు. ఫోన్‌లు కూడా స్విచ్ ఆఫ్ రావడంతో పోలీస్‌లను ఆశ్రయించినట్లు తెలిపారు. మహమ్మద్ అలీ, రేష్మాపై సైబరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు. అలీ, రేష్మా వద్ద సుమారు 50 మందికి పైగా చిట్టిలు వేసినట్లు సమాచారం.
ప్రస్తుత కాలంలో డబ్బులు సేవ్ చేయడానికి మధ్యతరగతి వారు ఎక్కువగా చిట్టీలు వేస్తుంటారు. వారు సంపాదించిన దానిలో ప్రతి నెలా కొంత దాచుకుని చిట్టీల రూపంలో పొదుపు చేస్తారు. ఈ చిట్టీల ద్వారా వచ్చిన డబ్బును కుటుంబ అవసరాలకు ఉపయోగిస్తుంటారు. అయితే ఇదే అదునుగా భావించిన కొంతమంది దుండగులు.. అధిక వడ్డీ రేట్లు ఇస్తామని ప్రజలకు ఆశ చూపి డబ్బులు మోసం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి..
United Aircraft Corporation: భారత్‌లో పౌర విమానాల తయారీ
Lufthansa Flight Incident: లుఫ్తాన్సా విమానంలో ఘర్షణ