HarishRao: అసెంబ్లీకి కేసీఆర్ హాజరుపై క్లారిటీ ఇచ్చిన హరీశ్‌రావు
ABN , Publish Date - Dec 28 , 2025 | 05:50 PM
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యావరేజ్‌గా 20రోజుల పాటు మాత్రమే సభను నడిపారని మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ఈ ఏడాది 16రోజులు మాత్రమే సభను నడిపారని ప్రస్తావించారు.
హైదరాబాద్, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ అసెంబ్లీ (Telangana Assembly) సమావేశాలు రేపటినుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, అసెంబ్లీకి బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) హాజరవుతారా లేదా అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ విషయంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (HarishRao) క్లారిటీ ఇచ్చారు. రేపు (సోమవారం) శాసనసభకు కేసీఆర్ వస్తున్నారని స్పష్టం చేశారు. అసెంబ్లీని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ హయాంలో ఏడాదికి యావరేజ్‌గా 32రోజుల పాటు శాసనసభను నడిపామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2024లో 24రోజుల పాటు సభను నడిపారని గుర్తుచేశారు. ఈ ఏడాది 16రోజుల పాటు మాత్రమే సభను నడిపారని ప్రస్తావించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యావరేజ్‌గా 20రోజుల పాటు మాత్రమే సభను నడిపారని తెలిపారు. ఇవాళ(ఆదివారం) అసెంబ్లీ మీడియా పాయింట్‌లో మాట్లాడారు హరీశ్‌రావు.
శాసనసభను నడపడానికి రేవంత్‌రెడ్డి సర్కార్ జంకుతోందని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం అడుగుతున్న అజెండాను ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు ఎత్తిపోతల్లో 90టీఎంసీల నుంచి 45 టీఎంసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు తగ్గించిందని నిలదీశారు. 45 టీఎంసీలకు ఉత్తరం రాశారా? లేదా? సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మహబూబ్‌నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల మధ్య ఈ ప్రభుత్వమే పంచాయితీ పెడుతోందని ధ్వజమెత్తారు. పాలమూరు, రంగారెడ్డి డీపీఆర్ వాపస్ వచ్చిందా? లేదా? చెప్పాలని ప్రశ్నించారు హరీశ్‌రావు.
ఇప్పటికీ డీపీఆర్ ఎందుకు రీసబ్మిట్ చేయలేదు? అని నిలదీశారు. అసెంబ్లీని 45రోజుల పాటు జరపాలని గతంలో కాంగ్రెస్ డిమాండ్ చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత సమావేశాలు కనీసం 15రోజుల పాటు జరపాలని డిమాండ్ చేశారు. కృష్ణా జలాల్లో తెలంగాణ నీటి వాటాపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పే లెక్కలు కాదని.. సమావేశాల కోసం తాము ఫుల్‌గా ప్రిపేర్ అయ్యామని స్పష్టం చేశారు. సభలో ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాల్సిన సమయం ఎందుకు ఇవ్వటం లేదని ప్రశ్నించారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కూడా సభ సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు హరీశ్‌రావు.
తమ సమయాన్ని కాలరాస్తున్నారని మండిపడ్డారు. తమ హక్కులు కాపాడాల్సింది స్పీకరేనని చెప్పుకొచ్చారు. 8, 7మంది సభ్యులున్న వారికి ఇచ్చిన సమయమే తమకూ ఇస్తే ఎలా అని ప్రశ్నించారు. హౌస్ కమిటీని ఎందుకు నియమించటం లేదని నిలదీశారు. వ్యవహారాల మంత్రిగా శ్రీధర్ బాబు ఫెయిల్ అయ్యారని విమర్శించారు. లోపం స్పీకర్ దగ్గర ఉందా? శాసనసభ వ్యవహారాల మంత్రి దగ్గర లోపం ఉందా? అని ఎద్దేవా చేశారు. చార్జ్ తీసుకోకుండా ఉత్తమ్ పద్మావతి ఎందుకు రాజీనామా చేశారు? అని ప్రశ్నించారు హరీశ్‌రావు.
కాంగ్రెస్ హామీలు, ఎరువుల కొరత, రైతుబంధుపై చర్చ జరగాలని సూచించారు. దేవుడుపై ప్రమాణం చేసి రుణమాఫీ ఎగ్గొట్టిన దానిపై చర్చ జరపాలని అన్నారు. హిల్ టీపీ, జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీల విలీనంపై చర్చ జరగాలని కోరారు. ట్రిపుల్ ఆర్, గురుకుల పాఠశాలల్లో విద్యార్థుల మరణాలపై చర్చ జరగాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభ్యంతరకరంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. హుందా తనం గురించి రేవంత్‌రెడ్డి నుంచి నేర్చుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం పీపీటీ ఇస్తే.. తమకు కూడా పీపీటీ అవకాశం ఇవ్వాలని హరీశ్‌రావు డిమాండ్ చేశారు
ఈ వార్తలు కూడా చదవండి...
జీహెచ్‌ఎంసీ మరో కీలక నిర్ణయం.. అధికారుల బదిలీలు
నేను ఆంధ్రాలో చదివితే రేవంత్‌రెడ్డికి వచ్చిన నొప్పేంటీ.. కేటీఆర్ ప్రశ్నల వర్షం
Read Latest Telangana News And Telugu News