Share News

Kishan Reddy Vs Raja Singh: కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు

ABN , Publish Date - Jun 08 , 2025 | 04:00 PM

హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై గోషా మహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్పందించారు.

Kishan Reddy Vs Raja Singh: కిషన్ రెడ్డి లక్ష్యంగా ఎమ్మెల్యే రాజా సింగ్ పరోక్ష విమర్శలు
Goshamahal MLA Raja Singh

హైదరాబాద్, జూన్ 08: కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డిపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి పరోక్ష విమర్శలు చేశారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆత్మకథ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ.. పరోక్ష విమర్శలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డి సహాయం అడుగుతున్న వారికి చెవులు ఉన్నా.. వినపడవని అన్నారు. నోరు ఉందని కానీ చెప్పరంటూ రాజా సింగ్ ఎద్దేవా చేశారు. అలాంటి మహానుభావులను అడిగితే ఏం సహాయం చేస్తారని ఎమ్మెల్యే రాజాసింగ్ పరోక్షంగా విమర్శించారు.


కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, గోషా మహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు బీజేపీలో అంతర్గతంగా ఓ చర్చ నడుస్తోంది. దీనిపై పలు సందర్భాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని విలేకర్లు ప్రశ్నించినా.. అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. అయితే పార్టీలో చిన్నచిన్న పొరపొచ్చాలు ఉన్నా వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వీటిని తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ చాలా కాలంగా కిషన్ రెడ్డి విషయంలో ఎమ్మెల్యే రాజా సింగ్ భిన్న వైఖరిని అవలంబిస్తున్నారు.


ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనూ అభ్యర్థిని బీజేపీలో అందరూ సమర్థిస్తే.. రాజాసింగ్ మాత్రం బాహాటంగానే విమర్శించారు. దీంతో కేంద్ర మంత్రి బండి సంజయ్ జోక్యం చేసుకుని ఎమ్మెల్యే రాజాసింగ్‌ను సముదాయించిన విషయం విదితమే. అనంతరం పలు సందర్భాల్లో సైతం కిషన్ రెడ్డిని రాజా సింగ్ పరోక్షంగా విమర్శించిన సందర్బాలూ అనేకం ఉన్నాయి. అయితే వారి మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఎటు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.


ఇంకోవైపు ఎమ్మెల్యే రాజా సింగ్‌ వైఖరిపై పార్టీ అగ్రనాయకత్వం గుర్రగా ఉన్నట్లు తెలుస్తోంది. అందులోభాగంగా ఇటీవల ఆయనకు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నాలు సైతం జరిగాయి. ఆ క్రమంలో రాష్ట్ర నాయకత్వంతో కేంద్రంలోని పార్టీ అగ్రనాయకత్వం చర్చలు జరిపింది. కానీ ఎందుకో.. మళ్లీ అగ్రనాయకత్వం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

ఈ వార్తలు కూడా చదవండి..

అమరావతి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన సీఎం చంద్రబాబు

జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 04:46 PM