Share News

Chandrababu: అమరావతి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 08 , 2025 | 02:55 PM

వైసీపీకి చెందిన సాక్షి మీడియాలో రాజధాని అమరావతి రైతులను కించపరుస్తు చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు.

Chandrababu: అమరావతి ఆడబిడ్డలపై అనుచిత వ్యాఖ్యలు.. స్పందించిన సీఎం చంద్రబాబు

అమరావతి, జూన్ 08: సాక్షి మీడియాలో రాజధాని అమరావతిలోని ఆడబిడ్డలను అవమానించిన వారిని ఉపేక్షించేది లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాజధాని అమరావతిలోని మహిళలపై సాక్షి మీడియాలో ప్రసారమైన అనుచిత వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిపై అత్యంత కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

ఆదివారం రాజధాని అమరావతిలో సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. రాజకీయ కక్షతో మహిళలపై నిస్సిగ్గుగా మాట్లాడారని మండిపడ్డారు. మన తల్లులు, చెల్లెళ్లపై చేసిన వ్యాఖ్యలు క్షమించరాని నేరమన్నారు. రాజకీయ, మీడియా ముసుగులో వికృత పోకడలు పోతున్నారంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వికృత పోకడలను తీవ్రంగా ఖండిస్తున్నాని ఆయన పేర్కొన్నారు.


స్త్రీ జాతికి వైఎస్ జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలను వైఎస్ జగన్‌ ఇప్పటికీ ఖండించక పోవడం విచారకరమని తెలిపారు. రాజధానిపై విషం చిమ్మే కుట్రలో భాగమే ఇలాంటి వ్యాఖ్యలని సీఎం చంద్రబాబు వివరించారు. మహిళలపై ఉద్దేశపూర్వకంగా, నీచాతినీచంగా మాట్లాడారన్నారు. మొత్తం మహిళా సమాజాన్నే అవమానించారన్నారు. ఇలాంటి నీచ సంస్కృతికి కూటమి ప్రభుత్వం చెక్‌ పెడుతుందని స్పష్టం చేశారు. విష సంస్కృతికి తిరుగుబాటుగా గత ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పారని గుర్తు చేశారు. అయినా వారి వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు.


రాజధాని అమరావతిపై వైఎస్ జగన్‌కు ఎందుకంత అక్కసు?

ఈ వ్యాఖ్యలపై రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. అమరావతి మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేయడం దారుణమని పేర్కొన్నారు. జర్నలిస్టులు ఇలా మాట్లాడటం సరికాదన్నారు. రాష్ట్ర గౌరవాన్ని దిగజార్చేలా సాక్షి చానల్‌లో మాట్లాడారన్నారు. రాజధాని అమరావతిపై వైఎస్ జగన్‌కు ఎందుకంత అక్కసు? అంటూ ఆమె ప్రశ్నించారు. అమరావతి అంటే వేల మంది రైతుల త్యాగమని ఈ సందర్భంగా ఆమె అభివర్ణించారు.


అమరావతి వేశ్యల రాజధాని అని హీనంగా మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆ పార్టీ నేతలపై మండిపడ్డారు. ఏపీ అభివృద్ధి చెందుతోందని వైసీపీ నేతల్లో అక్కసు మొదలైందన్నారు. రాజధాని అమరావతిపై అక్కసు వెళ్లగక్కుతున్నారని విమర్శించారు. అసభ్య వ్యాఖ్యలు చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టేది లేదని స్పష్టం చేశారు.


వైఎస్ జగన్‌రెడ్డి, భారతీరెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వస్తున్న ఫిర్యాదుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సాక్షి చానల్‌పైనా చర్యలు ఉంటాయని హోంమంత్రి అనిత హెచ్చరించారు. జర్నలిస్టు కృష్ణంరాజు తప్పు చేశాడని.. అతని భార్య, కూతురుని ట్రోల్ చేయడం తప్పుని మంత్రి అనిత పేర్కొన్నారు.

జర్నలిస్ట్ కృష్ణంరాజు, సాక్షి మీడియాపై పోలీసులకు అమరావతి రైతుల ఫిర్యాదు

బీచ్ ఫెస్టివల్‌కు ఊహకు అందని విధంగా పర్యాటకులు

For AndhraPradesh News And Telugu News

Updated Date - Jun 08 , 2025 | 06:22 PM