Ganesh Laddu Auctioned for Record: రూ. 2.32 కోట్లు పలికిన రాజేంద్రనగర్ గణేశ్ లడ్డూ.!
ABN , Publish Date - Sep 06 , 2025 | 11:07 AM
హైదరాబాద్ రాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట బాలాపూర్ గణేష్ లడ్డూ చరిత్రను తిరగరాసింది. అంటే వేలం ధర లక్షలకే కాకుండా ఏకంగా కోట్ల రూపాయలకు పెరిగింది.
హైదరాబాద్: వినాయక చవితి అంటే చాలు హైదరాబాద్‌లో జరిగే శోభాయాత్రలు, లడ్డూ వేలం పాటలే ఎక్కువగా గుర్తొస్తాయి. ఇక వినాయక లడ్డూ అంటే స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికీ బాలాపూర్ గణేశ్ లడ్డూ మాత్రమే గుర్తుకు వస్తుంది. ఎందుకంటే దశాబ్ధాల కాలం నుండి బాలాపూర్ గణేశ్ లడ్డూ వేలంలో రికార్డు స్థాయిలో ధర పలకుతూ వస్తుంది. అయితే, ఈ సారి మాత్రం రాజేంద్రనగర్‌లో జరిగిన గణేశుడి లడ్డూ వేలంపాట.. బాలాపూర్ గణేశ్ లడ్డూ చరిత్రను తిరగరాసింది. ఏకంగా రూ.2.32 కోట్లకు వేలం పాట పలికి రికార్డుగా నిలిచిందని సమాచారం.
తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్ ఎంత ఫేమసో, బాలాపూర్ గణేశ్ లడ్డూ అంత ఫేమస్.. బాలాపూర్‌లో గత కొన్ని దశాబ్దాలుగా లడ్డూ వేలం పాట ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంటూ వచ్చింది. అయితే, ఇటీవలి కాలంలో హైదరాబాద్‌కు చెందిన ఇతర ప్రాంతాలు కూడా లడ్డూ వేలంపాటలతో ప్రధాన ఆకర్షణగా మారుతున్నాయి.
ఈ సారి రాజేంద్రనగర్‌లో జరిగిన వేలం పాటలో భారీగా భక్తులు పాల్గొన్నారు. స్థానికులు మాత్రమే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వినాయక భక్తులు ఈ వేలంపాటను ప్రత్యక్షంగా వీక్షించారు. గణేశ్ లడ్డూ వేలం కేవలం లక్షలకే కాకుండా కోట్ల రూపాయలకు పెరగడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. ఈ రికార్డు ధరతో రాజేంద్రనగర్ లడ్డూ వేలం ఇప్పుడు బాలాపూర్ స్థాయిలో గుర్తింపు పొందే దిశగా ఉంది.
ఇదిలా ఉంటే.. కూకట్‌పల్లి బాలాజీనగర్‌లో ఏర్పాటు చేసిన గణేశుడి లడ్డూను కాలనీ అధ్యక్షుడు సాధు ప్రతాప్‌రెడ్డి రూ.5.15 లక్షలకు దక్కించుకున్నారు. రెండో లడ్డూను భాస్కర్‌రావు రూ. 2.10 లక్షలకు, మూడో లడ్డూను చుక్కా శ్రీనివాస్ రూ.1.60 లక్షలకు సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ, గత నెలలో అధ్యక్షుడిగా తాను గెలిచేందుకు సహకరించిన మిత్రులు, శ్రేయోభిలాషులకు ప్రసాదం పంపిణీ చేస్తానన్నారు. కూకట్‌పల్లి బాలాజీనగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు చేసి శుక్రవారం నిమజ్జనం నిర్వహించారు.
Also Read:
గణేశుల శోభాయాత్ర.. కిక్కిరిసిపోయిన ముంబై రోడ్లు..
For More Latest News