Alai Balai Event: నమ్మకం కుదిరింది: హీరో నాగార్జున
ABN , Publish Date - Oct 03 , 2025 | 04:58 PM
అలయ్ బలయ్.. ఆలింగనం చేసుకునే కార్యక్రమమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం తెలిపారు. హనుమంతుడిని శ్రీరామ చంద్రుడు ఆలింగనం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 03: దేశంలో కులం, మతం పేరుతో ప్రజలను చీల్చే ప్రయత్నం జరుగుతుందని మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. వేషం, భాష వేరైనా మనమంతా ఒక్కటేనని ఆయన స్పష్టం చేశారు. కులం, మతం పేరుతో దేశాన్ని చీల్చాలనే కుట్రలు సాగవని.. ఆ ప్రయత్నాలు చేసే వారిని హెచ్చరించారు. శుక్రవారం నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి ఆధ్వర్యంలో 'అలయ బలయ్' కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. విజయ దశమి అందరికీ విజయాలు అందించాలన్నారు. అలయ్ బలయ్ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.
నమ్మకం కుదిరింది: నాగార్జున
ఈ కార్యక్రమంలో సత్కారం చేయడం తనకు కొత్తగా అనిపించిందని హీరో నాగార్జున అన్నారు. పార్టీలకు అతీతంగా రాజకీయ నేతలంతా ఒకే వేదికపైకి రావడం తమలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిందని చెప్పారు. ఏదైనా ఇష్యూ వస్తే.. సపోర్టుగా నిలబడతారనే నమ్మకం తమకు కుదిరిందని ఆయన స్పష్టం చేశారు.
శాంతి నశిస్తున్న కాలంలో.. బ్రహ్మానందం
అలయ్ బలయ్.. ఆలింగనం చేసుకునే కార్యక్రమమని ప్రముఖ నటుడు బ్రహ్మానందం పేర్కొన్నారు. హనుమంతుడిని శ్రీరామచంద్రుడు ఆలింగనం చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. ఆనాటి నుంచి అలయ్ బలయ్ ఉందని వివరించారు. శాంతి నశిస్తున్న కాలంలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమంటూ మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయపై ఆయన ప్రశంసలు కురిపించారు.
వచ్చే ఏడాది రాయలసీమలో.. వీహెచ్
వచ్చే ఏడాది ఈ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని రాయలసీమలో నిర్వహించాలని వీహెచ్ అభిప్రాయపడ్డారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని.. ఈ బిల్లుకు ఎవరూ అడ్డు పడవద్దని నేతలకు వీహెచ్ సూచించారు.
పార్టీలో చేరిన తర్వాత.. ఈటల
మానవ సంబంధాల అల్లికలో దత్తన్న అలయ్ బలయ్ కార్యక్రమం గొప్పదని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అభివర్ణించారు. పార్టీలోకి వచ్చిన తర్వాత దత్తాత్రేయ గొప్పతనం తనకు ఇంకా బాగా తెలిసిందని తెలిపారు.
దత్తన్నను చూస్తే.. టీపీసీసీ చీఫ్
బండారు దత్తాత్రేయను చూస్తే రాజకీయాలు మర్చిపోతామని టీపీసీసీ చీఫ్ ముకేశ్ కుమార్ అన్నారు. అన్ని పార్టీలకు ఆత్మీయుడు బండారు దత్తాత్రేయ అని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అందరినీ కలిపే వేదిక అలయ్ బలయ్ అని తెలిపారు. ఎన్నికల వరకే పార్టీలు.. ఆ తర్వాత ప్రజలంతా కలిసికట్టుగా ఉండాలని పిలుపు నిచ్చారు.
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ..
ప్రజాభిప్రాయం మేరకు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు వెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అభిప్రాయపడ్డారు. తెలంగాణ సాధన కోసం అందరం ఐక్యంగా పోరాటం చేశామని గుర్తు చేశారు. బయట కత్తులు దూసుకునే వాళ్లు... ఇక్కడికి రాగానే అలయ్ బలయ్ చేసుకుంటారని చెప్పారు. ఎన్నికలు అంటేనే పోటీ అని.. ఆ క్రమంలో రాజకీయాలు సర్వ సాధారణమని పేర్కొన్నారు. ప్రశాంతంగా ఎన్నికల్లో పాల్గొందామని ఈ సందర్భంగా రాజకీయ పార్టీల నేతలకు ఆయన పిలుపు నిచ్చారు.
రాజకీయం లేకుండా ఏ కార్యక్రమం లేదు: సీపీఐ నారాయణ
ఇది రాజకీయాలకు అతీతమైన కార్యక్రమం అంటున్నారని సీపీఐ నేత నారాయణ పేర్కొన్నారు. రాజకీయం లేకుండా ఏ కార్యక్రమం ఉండదన్నారు. కానీ రాజకీయ ఐక్యత అవసరమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
తమకు అలా తెలుసు.. కవిత
దత్తాత్రేయ అంటే పది మందిని కలుపుకుని వెళ్లే నాయకుడని ఎమ్మెల్సీ కవిత చెప్పారు. దత్తాత్రేయ దగ్గరకు ప్రజలు వెళ్తే.. అందుకు సంబంధించిన అధికారికి ఫోన్ చేసి ఆ సమస్యను పరిష్కరించాలని చెబుతారని అంతా అంటారన్నారు. దత్తాత్రేయ బీజేపీ నాయకుడిగా తమకు తెలియదని.. ప్రజల మనిషిగా మాత్రమే తమకు తెలుసునని తెలిపారు. అయితే అలయ్ బలయ్ రాజకీయ వేదిక కాదంటూనే పలువురు నేతలు రాజకీయ కామెంట్స్ చేయడం గమనార్హం.
ఇవి కూడా చదవండి...
డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసుల ఉక్కుపాదం.. ఏం చేశారంటే..
హైదరాబాద్‌లో పర్యటించనున్న కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్..
Read Latest TG News And Telugu News