Share News

79th Independence Day: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు

ABN , Publish Date - Aug 14 , 2025 | 10:01 PM

భారత స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కేసీఆర్ కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు.

79th Independence Day: తెలంగాణ ప్రజలకు కేసీఆర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
KCR

హైదరాబాద్: ఆగస్టు 15న భారతదేశ 79వ స్వాతంత్ర్య దినోత్సవానికి పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. పరాయి పాలన నుంచి దాస్య శృంఖలాలను తెంచుకుని, స్వేచ్ఛా వాయువులతో భరతమాత స్వయంపాలన దిశగా అడుగులేసి 79 ఏళ్లు గడిపోయాయని పేర్కొన్నారు. త్యాగనిరతితో ఎందరో అమరవీరులు, దేశభక్తులు చేసిన ఆత్మార్పణలు మహోన్నతమైనవని కేసీఆర్ ప్రశంసించారు. ఈ సందర్భంగా దేశ స్వాతంత్ర్యం కోసం సాగిన బలిదానాలు, త్యాగాల చరిత్రను కేసీఆర్ స్మరించుకున్నారు.


స్వాతంత్ర్య సమరాన్ని నిరాయుధ, శాంతియుత పద్ధతిలో మహాత్మాగాంధీ నడిపారని కొనియాడారు. అహింసా పద్ధతిలో నడిచిన దేశ స్వాతంత్ర్య పోరాట కార్యాచరణ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో ఇమిడి ఉందని కేసీఆర్ చెప్పుకొచ్చారు. జాతి ఆత్మగౌరవం, స్వయంపాలన కోసం చేసిన త్యాగాలు స్వాతంత్ర్యానంతర భారతదేశంలో స్వార్థ రాజకీయాల కోసం దుర్వినియోగం కావడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.


స్వాతంత్ర్య భారతంలో ప్రత్యేక రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ.. పదేళ్ల అనతి కాలంలోనే ఆదర్శంగా నిలవడం గర్వంగా ఉందని కొనియాడారు. అమరుల త్యాగాలను గౌరవించుకుంటూ స్వాతంత్ర్య ఫలాలు చివరి గడపకు అందించి, దేశ సమగ్రాభివృద్ధికి దోహదం చేసిన నాడే దేశ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మరింత ఇనుమడిస్తాయని కేసీఆర్ స్పష్టం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

పోలీసుల విద్యార్హతపై.. డీజీపీ కీలక వ్యాఖ్యలు

సీఎంపై ప్రశంసలు.. ఎమ్మెల్యేను బహిష్కరించిన పార్టీ

Updated Date - Aug 14 , 2025 | 10:01 PM