Jubilee Hills By Election: హైదరాబాద్‌లో జూబ్లీహిల్స్ రిచెస్ట్ ప్లేసే కానీ.. ఎంపీ ఈటల
ABN , Publish Date - Oct 28 , 2025 | 07:39 PM
బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ నిప్పులు చెరిగారు. ఈ రెండు పార్టీలు ప్రజలకు ఏం చేయలేదన్నారు. మంగళవారం జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
హైదరాబాద్, అక్టోబర్ 28: జూబ్లీహిల్స్ అంటే హైదరాబాద్‌లో రిచెస్ట్ ప్లేస్ కానీ ఈ నియోజకవర్గంలోని బస్తీల ప్రజల బాధలు మాత్రం వర్ణనాతీతమని మల్కాజ్‌గిరి ఎంపీ, బీజేపీ నేత ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో మంగళవారం ఆయన నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. తాను మూడవ రోజు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నానన్నారు. అయితే పేరుకే జూబ్లీహిల్స్.. పారే మురికి కాలువలు, కంపు వాసనలు, గతుకుల రోడ్లు ఏ పేదవాడిని కదిలించినా మమ్మల్ని పట్టించుకునే వారే లేరని ఆవేదన చెందుతున్నారని తెలిపారు. భర్త చనిపోయి ఐదేళ్లు అయినా.. 65 ఏళ్ళు దాటిన తమకు పెన్షన్ రావడం లేదని ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఆయన పేర్కొన్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఇస్తామంటూ మోసం చేసిందని.. ఇవన్నీ ఇస్తారని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఆ పార్టీ సైతం తమను మోసం చేసింది ప్రజలు మండిపడుతున్నారని చెప్పారు.
పెన్షన్లు లేవు, ఇళ్లు లేవు, మురికి కాల్వలు సరిగా లేవు, తాగే నీరు సైతం సరిగ్గా రావడం లేదని బస్తీల ప్రజలు చెబుతున్నారన్నారు. టిఆర్ఎస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెట్టామని.. కాంగ్రెస్ పార్టీకి సైతం అదే గతి పడుతుందని వారు అంటున్నారని చెప్పారు. 40 ఏళ్ల క్రితం ఎలా ఉందో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అలాగే ఉందని ఆయన వ్యంగ్యంగా అన్నారు. మంత్రుల మధ్య సమన్వయం లేదని చెప్పారు. మంత్రులకు డబ్బులు సంపాదించుకోవడానికి, దోచుకోవడానికే సమయం సరిపోతుంది తప్ప ప్రజలను పట్టించుకోవడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే ప్రజల సమస్యలపై అసెంబ్లీ వేదికగా కొట్లాడుతున్నది బీజేపీ మాత్రమేనని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. జూబ్లీహిల్స్‌లో ఆ రెండు పార్టీలను బొందపెడితేనే చలనం వస్తుందని ప్రజలకు సూచించారు. పెన్షన్లు రావాలన్నా, డబుల్ బెడ్ రూం ఇళ్లు రావాలన్నా, మురికి కాలువలు కట్టాలన్నా, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే వారి మెడలు వంచి బీజేపీ కొట్లాడుతుందని ఎంపీ ఈటల స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దీపక్ రెడ్డికి ఓటు వేయాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
దీపక్ రెడ్డి ఇప్పటికే ఇక్కడ పోటీ చేసి ఉన్నారని గుర్తు చేశారు. ఆ క్రమంలో ఆయన అందరికి సుపరిచితుడన్నారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోకి వస్తుందని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉందన్నారు. తమ పార్టీ కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, లీడర్లు ఇలా ప్రతి ఇంటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారని గుర్తు చేశారు.
ఎక్కడికి వెళ్ళినా దేశం సుభిక్షంగా ఉండాలంటే మోదీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. మోదీ లేకపోతే దేశం అధోగతి పాలవుతుందనే భావన ప్రజల్లో ఉందని చెప్పారు. బీజేపీ అంటే ఎంత ప్రేమ ఉందో, విశ్వాసం ఉందో దీనిని బట్టి అర్థమవుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇద్దరు షో పుటప్ గాళ్ళుని.. తిమ్మిని బమ్మి చేసి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వారి మీద ప్రజలకు నమ్మకం లేదన్నారు. జూబ్లీహిల్స్‌లో బీజేపీ చాపకింద నీరులా విస్తరిస్తోందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
మొంథా తుపాన్‌పై ఆరా.. రైల్వే మంత్రి కీలక ఆదేశాలు
ప్రజల ప్రాణాలకు ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్తలు: నారా లోకేశ్
For More TG News And Telugu News