ADE Ambedkar Corruption: విద్యుత్ శాఖ ఏడీఈ అంబేద్కర్‌పై వేటు
ABN , Publish Date - Sep 24 , 2025 | 10:02 AM
ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. వెంటనే అంబేద్కర్‌ను అరెస్ట్ చేసిన అధికారులు కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం.
హైదరాబాద్, సెప్టెంబర్ 24: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈ (అసిస్టెంట్ డివిజినల్ ఇంజనీర్) అంబేద్కర్‌పై వేటు పడింది. ఆయనను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. కొద్దిరోజుల క్రితం అంబేద్కర్ నివాసంలో ఏసీబీ సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే.. ఈ క్రమంలో ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు సోదాల్లో అధికారులు గుర్తించారు. వెంటనే ఆయనను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరుచగా.. 14 రోజుల రిమాండ్ విధించింది న్యాయస్థానం. దీంతో ఆయనను చెంచల్‌గూడ జైలుకు తరలించారు. ఇప్పటికే అంబేద్కర్‌ను కస్టడీకి ఇవ్వాల్సిందిగా ఏసీబీ అధికారులు పిటిషన్ వేశారు.
ఇక.. దాదాపు 200 కోట్ల అక్రమాస్తులను అంబేద్కర్ కూడబెట్టినట్లు ఏసీబీ సోదాల్లో బయటపడింది. అంతేకాకుండా ప్రభుత్వ అధికారిగా ఉంటూనే పది ఎకరాల స్థలంలో ప్రైవేట్ సంస్థను స్థాపించి డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నాడు. అంతార్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీని రెండు సంవత్సరాల క్రితం స్థాపించాడు అంబేద్కర్. శేరిలింగంపల్లిలో అధునాతనమైన భవనం, సిటీలో ఆరు ఇంటి స్థలాలు, హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్ ఉన్నట్లు తనిఖీల్లో ఏసీబీ గుర్తించింది. ఇక అంబేద్కర్ బినామీ సతీష్ ఇంట్లో రికార్డు స్థాయిలో రూ.2 కోట్లకు పైగా నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
మణికొండ విద్యుత్ శాఖ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్న అంబేద్కర్.. మణికొండతో పాటు నార్సింగి డివిజన్‌కు కూడా ఏడీఈగా వ్యవహరిస్తున్నారు. విద్యుత్ శాఖలో అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ బాధ్యతలు కీలకం. కొత్త కనెక్షన్లు, అప్‌గ్రేడేషన్లు, లైన్ షిఫ్టింగ్ పనులకు టెక్నికల్ ఆమోదం ఇవ్వడం లాంటి కీలక బాధ్యతలను అంబేద్కర్ చూస్తున్నారు. మణికొండ, నార్సింగి ప్రాంతంలో పెద్ద ఎత్తున బహుళ అంతస్థుల భవనాలు నిర్మాణం జరుగుతుండగా.. వాటి అనుమతుల కోసం వచ్చిన వారి నుంచి అంబేద్కర్ భారీగా ముడుపులు తీసుకున్నట్లు తేలింది. ఈ క్రమంలో అంబేద్కర్ వ్యవహారశైలిపై ఏసీబీకి ఫిర్యాదులు వెళ్లాయి. దీంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించి భారీ ఎత్తున అక్రమాస్తులు ఉన్నట్లు గుర్తించింది.
ఇవి కూడా చదవండి..
అసెంబ్లీలో ఆమోదం పొందనున్న పలు బిల్లులు
Ongole Earthquake: ఉలిక్కిపడ్డ ఒంగోలు.. అర్ధరాత్రి భూ ప్రకంపనలు..
Read Latest Telangana News And Telugu News