Warangal Floods: వరంగల్‌ను ముంచెత్తిన తుపాను.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
ABN , Publish Date - Oct 30 , 2025 | 02:47 PM
హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.
హైదరాబాద్, అక్టోబర్ 30: మొంథా తుపాను వరంగల్ జిల్లాను ముంచెత్తింది. భారీ వరదలకు అనేక ప్రాంతాలు నీటమునిగాయి. ఈ క్రమంలో జిల్లాలో వరదలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పందిస్తూ.. పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. వరంగల్లో వరద బాధితులకు అందించే సహాయక చర్యలను ముమ్మరం చేయాలని సీఎం ఆదేశించారు. వెంటనే అవసరమైనన్ని పడవలను అక్కడికి పంపించాలని, వివిధ జిల్లాల్లో అందుబాటులో ఉన్న ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందిని తక్షణమే తరలించాలని సీఎస్, డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. హైడ్రా సిబ్బందిని, హైడ్రా వద్ద ఉన్న వరద సహాయక సామాగ్రిని కూడా అత్యవసరమైన చోట వినియోగించుకునే చర్యలు చేపట్టాలన్నారు.
ముంపు ప్రాంతాల్లో ఉన్న వారిని వెంటనే సురక్షిత ప్రాంతానికి తరలించాలని, ఎక్కడైనా వరదలో ఇండ్ల కప్పులు, బంగ్లాలపై చిక్కుకున్న కుటుంబాలకు డ్రోన్ల ద్వారా తాగు నీటితో పాటు, ఫుడ్ పాకెట్లు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. కాగా.. రేపు (శుక్రవారం) వరంగల్ జిల్లాకు వెళ్లనున్న సీఎం... వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించనున్నారు. రేపు వరంగల్, హుస్నాబాద్ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు.
కాగా.. వరంగల్ నగరాన్ని మొంథా తుపాను అతలాకుతలం చేసింది. భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అనేక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరంగల్ నగరంలోని 30 ముంపు కాలనీలతో పాటు హనుమకొండలోని 15 ముంపు కాలనీవాసులను సురక్షితంగా పునరావాస కేంద్రాలకు డిజాస్టర్ సిబ్బంది తరలించింది. హనుమకొండలో మూడు పునరావాస కేంద్రాలు, వరంగల్లో 9 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 1200 మందిని సురక్షితంగా పునరావాస కేంద్రాలకు తరలించారు. గ్రేటర్ పరిధిలో ఏడు ప్రత్యేక బృందాలను వరంగల్ మహా నగర పాలక సంస్థ కమిషనర్ ఏర్పాటు చేసింది. ఏడు బృందాల ద్వారా సహాయ చర్యలను సిబ్బంది చేపట్టింది. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో పాఠశాలలకు జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించారు.
ఇవి కూడా చదవండి...
వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే
CM Revanth Reddy: డేంజర్‌లో 16 జిల్లాలు.. రేపు వరంగల్‌కు సీఎం రేవంత్
Read Latest Telangana News And Telugu News