Share News

Sangam Barrage Nellore: సమిష్టి కృషితో ఒడ్డుకు చేరిన భారీ బోటు.. యంత్రాంగానికి అభినందన వెల్లువ

ABN , Publish Date - Oct 30 , 2025 | 01:03 PM

బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు.

Sangam Barrage Nellore: సమిష్టి కృషితో ఒడ్డుకు చేరిన భారీ బోటు.. యంత్రాంగానికి అభినందన వెల్లువ
Sangam Barrage Nellore

నెల్లూరు, అక్టోబర్ 30: జిల్లాలోని సంగం బ్యారేజ్‌కు (Sangam Barrage) పెను ముప్పు తప్పింది. వరదలకు కొట్టుకొచ్చిన భారీ బోటును జిల్లా యంత్రాంగం ఎంతో చాకచక్యంగా ఒడ్డుకు చేర్చడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. నెల్లూరు జిల్లాలో మొంథా తుపాను తీవ్ర ప్రభావాన్ని చూపింది. రికార్డు స్థాయిలో వర్షాలు కురవడంతో వాగులు, వంకలు పొంగిపొర్లాయి. అలాగే సంగం బ్యారేజ్‌కు లక్షల క్యూసెక్కుల వరద ప్రవాహాలు చేరాయి. వరదలకు సంగం బ్యారేజ్‌కు 30 టన్నుల భారీ బోటు కొట్టుకొచ్చింది. లక్ష క్యూసెక్కుల వరద ప్రవాహం కొనసాగుతున్న వేళ కొట్టుకొచ్చిన బోటు ప్రాజెక్టుకు తగిలితే బ్యారేజ్‌కు తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం బోటుతో బ్యారేజ్‌కు నష్టం జరుగకుండా సమిష్టి కృషితో వేగవంతంగా చర్యలు తీసుకుంది.


విషయం తెలిసిన వెంటనే బోటు ఉన్న ప్రాంతానికి జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా, జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల చేరుకున్నారు. ఇద్దరు జిల్లా ఉన్నతాధికారుల పర్యవేక్షణలో వివిధ విభాగాల అధికారులు బోటును తరలించే చర్యలు చేపట్టారు. 30 మంది ఎన్డీఆర్‌ఎఫ్ సభ్యులు, 30 మంది ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు, 100 మంది పోలీస్ యంత్రాంగం, కృష్ణపట్నం పోర్టు గస్తీ బృందం, ఫైర్, ఇరిగేషన్ అధికారుల నిరంతర కృషి ఫలితంతో ఎట్టకేలకు బోటు ఒడ్డుకు చేరింది. 85 గేట్లతో, 3,85,000 ఎకరాలు ఆయకట్టుతో బీడు భూములను సస్యశ్యామలం చేస్తున్న సంగం బ్యారేజ్ ప్రమాదానికి గురికాకుండా కాపాడిన వైనంపై జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టడంతో జిల్లా యంత్రాంగానికి సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.


ఇవి కూడా చదవండి...

వీఎంసీ పాలకవర్గంపై ప్రభుత్వం సీరియస్.. కారణమిదే

రైతన్నలకు డిప్యూటీ సీఎం పవన్ భరోసా

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 30 , 2025 | 01:22 PM