TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
ABN , Publish Date - May 05 , 2025 | 05:53 PM
TGSRTC Workers Strike: ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వారికి సూటిగా పలు ప్రశ్నలు సంధించారు.

హైదరాబాద్, మే 05: ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మె నిర్ణయంపై వెనక్కి తగ్గేది లేదంటూ ప్రభుత్వానికి వారు ఇప్పటికే స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో ఆర్టీసీ కార్మికులు చేపట్టనున్న సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం హైదరాబాద్‌లో జీ అవార్డులు 2025 ఫంక్షన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మీ సమరం తెలంగాణ ప్రజలపైనా?.. ఎందుకు మీ సమరం… గతంలో లేని విధంగా మొదటి తారీఖునే జీతాలు ఇస్తున్నందుకా? అంటూ ఆర్టీసీ కార్మికులను ఆయన సూటిగా ప్రశ్నించారు. ప్రతీ నెలా రూ. 7 వేల కోట్లు ఆర్టీసీ ఉద్యోగులకు జీతాలుగా ప్రభుత్వం చెల్లిస్తుందన్నారు. గత పాలకులు రూ. 8,500 కోట్లు రిటైర్మెంట్ బెనిఫిట్స్ బకాయిలు పెట్టి వెళ్లారని ఈ సందర్భంగా వారికి ఆయన గుర్తు చేశారు. అయితే కొన్ని రాజకీయ పార్టీలు తమపై ఆరోపణలు చేస్తున్నాయన్నారు. అవన్నీ గత ప్రభుత్వంలోని వాళ్లు చెల్లించకుండా పెండింగ్ పెట్టి వెళ్లిన బకాయి లేనని ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.
కేవలం పదహారు నెలల్లో తమ ప్రభుత్వం రైతుల ఖాతాలకు రూ. 30 వేల కోట్ల నగదును బదిలీ చేసిందన్నారు. ఉచిత విద్యుత్ అని చెప్పి విద్యుత్ శాఖకు బకాయిలు పెట్టి వెళ్లారంటూ గత ప్రభుత్వంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఉత్పత్తికి బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి సైతం బకాయిలు పెట్టి వెళ్లిన ఘనత గత ప్రభుత్వానిదని ఆయన విమర్శించారు. ప్రాజెక్టులు నిర్మించామని చెప్పి..కాంట్రాక్టర్లకు సైతం బకాయిలు పెట్టారని ఈ సందర్బంగా గుర్తు చేశారు. 11 శాతం వడ్డీకి అప్పులు తెచ్చారని.. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? అంటూ బీఆర్ఎస్ నేతలపై సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వం అంటే మేం ఒక్కరమే కాదని.. మనమంతా కలిస్తేనే ప్రభుత్వమన్నారు. మనం పాలకులం కాదని… సేవకులమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు.
ప్రభుత్వం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు.. సమరమని అంటున్నారని మండిపడ్డారు. ఎవరిపై సమరం… ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు వారికి అండగా ఉండాల్సిన బాధ్యత ఉద్యోగ సంఘాల నాయకులపై లేదా? అంటూ కార్మిక జేఏసీ నేతలను ఆయన నిలదీశారు. ఉద్యోగ సంఘాల నాయకులకు తాను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నానని.. ఏదైనా సమస్య ఉంటే చర్చించుకుందామన్నారు. మనం సమరం చేయడానికి ఇక్కడ లేమని.. ప్రజలకు సేవ చేయడానికే ఇక్కడ ఉన్నామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రజలపై యుద్ధం చేసి.. బాగుపడినవారు ఎవరూ లేరని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని అస్థిర పరిచాలనే రాజకీయ పార్టీల కుట్రలో ఉద్యోగ సంఘాలు పావులుగా మారొద్దంటూ కార్మికల నేతలకు ఆయన హితవు పలికారు. కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుందన్నారు. బాధ్యతగా వ్యవహరించాల్సిన మీరు.. బాధ్యత మరిచి వ్యవహరిస్తే తెలంగాణ సమాజం సహించదని హెచ్చరించారు. అప్పులు పుట్టినా ఏదైనా చేయొచ్చు.. కానీ ఎక్కడా అప్పు పుట్టడం లేదన్నారు. స్వీయ నియంత్రణనే దీనికున్న ఏకైక పరిష్కారమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
ఉద్యోగ సంఘాల నాయకుల్లారా.. రాష్ట్ర ప్రభుత్వం మన కుటుంబం.. కుటుంబ పరువును బజారున పడేయొద్దంటూ కార్మిక సంఘాల నేతలకు ఆయన హితవు పలికారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థ దెబ్బతిన్నదని ఈ సందర్భంగా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నన్ను కోసినా… వచ్చిన ఆదాయానికి మించి నేను ఏం చేయలేనని స్పష్టం చేశారు. ఆర్ధిక విధ్వంసం చేసిన వ్యక్తి… ఇపుడు ఫామ్ హౌస్‌లో హాయిగా పాడుకున్నారంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను పరోక్షంగా విమర్శించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్లారా ఇప్పుడు కావాల్సింది సమరం కాదు… సమయస్ఫూర్తి, సంయమనమని పేర్కొన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా… తెలంగాణను మళ్లీ కోతుల గుంపునకు అప్పగించొద్దని సూచించారు. నాతో కలిసి రండి.. తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళదామని ఆర్టీసీ కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు నిచ్చారు.
తెలంగాణలో పోలీసులు నూటికి నూరు శాతం శాంతి భద్రతలు కాపాడుతున్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలబడి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించగలుగుతోందన్నారు. దేశ సరిహద్దుల్లోని సైనికుల్లా రాష్ట్రంలో శాంతి భద్రతలను పోలీసులు పరిరక్షిస్తున్నారని చెప్పారు. పోలీస్ ఉద్యోగం కత్తి మీద సాము లాంటిదని ఆయన అభివర్ణించారు. విధి నిర్వహణలో పోలీసులు చిత్తశుద్ధితో పని చేస్తున్నారు కాబట్టే మనం ప్రశాంతంగా ఉండ గలుగుతున్నామన్నారు. ప్రజా ప్రభుత్వంలో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల కుటుంబాలకు భరోసా అందిస్తున్నామని స్పష్టం చేశారు.
విధి నిర్వహణలో మరణించిన ఐపీఎస్ కుటుంబాలకు రూ.2 కోట్లు.. అడిషనల్ ఎస్పీ,ఎస్పీ కుటుంబాలకు రూ.కోటిన్నర నగదు అందిస్తున్నామని గుర్తు చేశారు. విధి నిర్వహణలో మరణించిన పోలీస్ కుటుంబాలను ఆదుకునేందుకు ఈ ప్రజా ప్రభుత్వంలో అన్ని చర్యలు తీసుకున్నామని ఆయన సోదాహరణగా వివరించారు. పోలీస్ పిల్లల భవిష్యత్ కోసం 50 ఎకరాల్లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌ను ప్రారంభించుకున్నామని తెలిపారు. వారికి మంచి భవిష్యత్ అందించే బాధ్యత మాదని ఆయన స్పష్టం చేశారు.
డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్స్ విభాగాన్ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. మారుతున్న కాలంతో పాటు నేరగాళ్లు కొత్త పద్ధతులు అవలంబిస్తున్నారని గుర్తు చేశారు. సైబర్ క్రైమ్ నియంత్రణకు ఆ విభాగాన్ని మరింత బలోపేతం చేశామన్నారు. నేరం జరిగినప్పుడే కాదు..నేరం జరగకుండా నియంత్రించాల్సిన బాధ్యత సైతం పోలీసులపై ఉందని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి..
Pahalgam Terror Attack: ప్రధాని మోదీతో రక్షణ శాఖ కార్యదర్శి భేటీ.. ఎందుకంటే..
WAQF Amendment Bill 2025: వక్ఫ్ సవరణ బిల్లుపై విచారణను ఈ నెల 15కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
TGSRTC: బస్ భవన్‌ను ముట్టడించిన కార్మికులు.. పరిస్థితి ఉద్రిక్తం
For Telangna News And Telugu News